Begin typing your search above and press return to search.

బాబుకు ఏమాత్రం చాన్సివ్వ‌ని వీర్రాజు - పురందీశ్వ‌రి

By:  Tupaki Desk   |   27 Jan 2018 11:25 PM IST
బాబుకు ఏమాత్రం చాన్సివ్వ‌ని వీర్రాజు - పురందీశ్వ‌రి
X
క‌ల‌హాల కాపురం అన్న‌ట్లుగా సాగుతున్న టీడీపీ-బీజేపీ బంధంలోని లుక‌లుక‌లు మ‌రోమారు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఏకంగా ముఖ్య‌మంత్రి - టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అదే స‌మ‌యంలో....ఆయ‌న‌కు బీజేపీ నేత‌లు సైతం ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. బీజేపీ నేతలు టీడీపీపై చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ... మిత్ర ధర్మం వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీని ర‌క్షించుకునేందుకు ఠ‌క్కున స్పందించే ఎమ్మెల్సీ సోము వీర్రాజు - కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరి అదే రీతిలో ఘాటుగా రియాక్ట‌య్యారు.

సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల గురించి మీడియా ప్ర‌స్తావించ‌గా...తమతో పొత్తులో ఉండాలో - వద్దో తేల్చుకోవాల్సింది టీడీపీయే అని పురందీశ్వ‌రి తేల్చిచెప్పారు. ఒకవేళ టీడీపీకి త‌మ‌తో పొత్తు ఉండాలనే ఉద్దేశం లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడొచ్చు అని సూచించారు. బీజేపీతో పొత్తు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానమే చూసుకుంటుందని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో తాను ప్ర‌స్తావించిన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. పంచాయతీలకు నిధులు నేరుగా కేంద్రం నుంచే విడుదలవుతున్నాయని, అయితే ఈ విష‌యంలో కేంద్రం గురించి తెలియ‌జెప్ప‌డం లేద‌ని పురందీశ్వ‌రి అన్నారు. టీడీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ పథకాలనే పేరు మార్చి తనవిగా చెప్పుకుంటోందని దుయ్య‌బ‌ట్టారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు లేఖ రాసినట్లు టీడీపీ క‌ల‌వ‌రానికి గుర‌య్యే వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సైతం బాబు కామెంట్లపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించే సమయం ఆసన్నమైంది. `చంద్రబాబుకు పొత్తు ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా?అసలు టీడీపీ మిత్ర ధర్మం పాటిస్తుందా? ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టారు? కేంద్రంపై మీరు సుప్రీంకోర్టుకు వెళ్తారా? అలా కేసు వేస్తాననడం మిత్రధర్మం ఉల్లంఘన కాదా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. బాబు వ్యాఖ్య‌ల‌పై త‌మ పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందిస్తుందన్నారు. టీడీపీతో కొన‌సాగే విష‌యంలో చంద్రబాబుకు న‌చ్చ‌క‌పోతే.. అది వారిష్టమ‌ని వీర్రాజు వ్యాఖ్యానించారు.

కాగా, ఏపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించిన వారి మాట ప్ర‌కారం రాష్ట్ర బీజేపీ ముఖ్య‌నాయ‌కుల్లో రెండుగా చీలిక ఉందని అంటున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు... అంతర్గత ఆదిపత్యపోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరి వంటివారు వ్యతిరేక వ‌ర్గ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఈ నేత‌లు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రిస్తున్నారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల విష‌యంలో అదే జ‌రిగింద‌ని విశ్లేషిస్తున్నారు.