Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ గృహ‌నిర్భందం..పురంధేశ్వ‌రి సూటి ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   2 Aug 2017 6:43 PM IST
ముద్ర‌గ‌డ గృహ‌నిర్భందం..పురంధేశ్వ‌రి సూటి ప్ర‌శ్న‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఇర‌కాటంగా మారిన కాపు రిజ‌ర్వేష‌న్ అంశం - మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాద‌యాత్ర‌ విష‌యంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. ముద్ర‌గ‌డ అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ను అడ్డుకొని గృహ‌నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పురంధేశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాస్వామ్య‌యుతంగా త‌మ అభిప్రాయాన్ని వినిపిస్తుంటే ఎందుకు అడ్డుకోవ‌డ‌మ‌ని ప్ర‌శ్నించారు. ముద్ర‌గ‌డను గృహ‌నిర్భందం చేయ‌డం స‌రైన‌ది కాద‌ని ఆమె తేల్చిచెప్పారు.

స‌భ‌లు, పాద‌యాత్ర‌ల విష‌యంలో అనుమ‌తుల నిరాక‌ర‌ణ సరైన‌ది కాద‌ని పురందేశ్వ‌రి స్ప‌ష్టం చేశారు. త‌ద్వారా ఎమ్మార్పీఎస్ అధినేత మంద‌కృష్ణ మాదిగ‌, కాపు రిజ‌ర్వేష‌న్ల పోరాట‌స‌మితి నాయ‌కుడు మంద‌కృష్ణ మాదిగ‌ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తిచ్చారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ద్ద‌తిగా ముందుకు వెళితే త‌దుప‌రి నిర్ణ‌యం కేంద్రం తీసుకుంటుంద‌ని పురందేశ్వ‌రి అన్నారు. త‌మ పార్టీ విష‌యాల గురించి ప్ర‌స్తావిస్తూ మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీని గౌర‌విస్తూనే సొంతంగా ఎద‌గాల‌నే ఆకాంక్ష‌తో ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని కీల‌క ప‌రిణామాల గురించి త‌మ అధిష్టానానికి తెలియ‌జేయ‌డం అనేది పార్టీప‌ర‌మైన నిరంత‌ర ప్ర‌క్రియ అని తెలిపారు. పొత్తుల గురించి స్పందిస్తూ భ‌విష్య‌త్‌లోని అంశాల గురించి పార్టీ పెద్ద‌లు స‌రైన నిర్ణ‌జ్ఞం తీసుకుంటార‌ని ఆమె వివ‌రించారు.

మ‌రోవైపు బీసీ నేత - ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో కలపడం చట్టవిరుద్దమని అన్నారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి 1994లో కాపులను బీసీలో చేర్చుతూ జీవో తెచ్చారన్నారు. జీవోపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కొట్టివేసిందని గుర్తు చేశారు. తాను ఏపీ టీడీపీ మేనిఫెస్టోను వ్యతిరేకించానని ఆర్ కృష్ణ‌య్య‌ తెలిపారు. కాపులను బీసీల్లో ఎలా కలుపుతారని ఆయ‌న‌ ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ దీనిపై ఆలోచించాలన్నారు. పేదలు అన్ని కులాల్లో ఉంటారన్నారు. పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని ఆర్‌.కృష్ణ‌య్య వ్యాఖ్యానించారు.

మరోవైపు ముద్రగడ నివాసం మహిళలతో కిక్కిరిసింది. తమ పిల్లల భవిష్యత్తు బంగారుబాట వేసేందుకు ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి తామంతా మద్దతుగా ఉంటామని మహిళలు అన్నారు. వారు ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిసి తమ మద్దతు ప్రకటించారు. పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని మహిళలు ముద్రగడను కలిసి ఆయన చేయబోయే నిరవధిక పాదయాత్రలో పాల్గొంటామన్నారు. ఉదయం 12గంటలకు ముద్రగడ నివాసంలో రెండవ రోజు కూడా ఆయన సతీమణి పద్మావతి, కోడలు సిరి, మనుమరాలు భాగ్యశ్రీలతో కలిసి కాపుల ఆకలి కేకలు తెలియజేసే విధంగా వారు కంచాలపై గరిటెలతో వాయిస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. తనని కలిసిన మహిళలతో ముద్రగడ మాట్లాడుతూ కాపులకు బిసి రిజర్వేషన్ సాధించుకునేందుకు సమయం ఆసన్నమైందని, విశ్రాంతి లేకుండా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు.

ఆగస్టు 3వ తేదీలోగా కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించాలన్నారు. అలాకాని పక్షంలో 3వ తేదీ నుంచి తాను నిరవధిక పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. అందరూ ఓపికతో ప్రశాంతంగా, జాతీయ మార్గంలో నిరసన కార్యక్రమాలు చేయాలన్నారు. పోలీసులు మన గ్రామాలను కాపలాకాస్తారని, మనమంతా గాంధీ మార్గంలో మీకనువైన ప్రదేశాలలో ఉద్యమ కార్యక్రమాలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తన పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమం చేస్తానన్నారు. జాతి కోసం తన ప్రాణాన్ని ఫణంగాపెట్టి లక్ష్యాన్ని సాధిస్తానని కాపు ఉద్యమ సారధి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాగా ప్రత్తిపాడు - వేళంక - సింహాద్రిపురం - రాజుపాలెం గ్రామాలలో ముద్రగడకు మద్దతుగా కాపు, బలిజ నాయకులు, కాపు యువకులు, అభిమానులు రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించరాదని, తామంతా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తామని వారు అన్నారు.