Begin typing your search above and press return to search.

పంజాబ్ కు సీఎం కానున్న చన్నీ బ్యాక్ డ్రౌండ్ ఏమిటి?

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:52 AM GMT
పంజాబ్ కు సీఎం కానున్న చన్నీ బ్యాక్ డ్రౌండ్ ఏమిటి?
X
అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ అధినాయకత్వం పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్ జిత్ సింగ్ చన్నీను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ రోజు (సోమవారం) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అయన్నే సీఎంగా ఎందుకు ఎంపిక చేశారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. దళిత సిక్కు నాయకుడిగా పేరున్న చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్ లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రామదాసియా సిక్కు వర్గానికి చెందిన వారు. చర్మకారుల వ్రత్తిని చేపట్టే వర్గానికి చెందినప్పటికీ ఆయన తండ్రి హర్సా సింగ్ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా.. బ్లాక్ సమితి సభ్యుడిగా పని చేశారు.

అలా తండ్రి నుంచే చన్నీ రాజకీయ అక్షరాభాస్యం జరిగింది. స్కూల్ యూనియన్ నాయకుడిగా ఎన్నికైన ఆయన.. పాఠశాల విద్య తర్వాత చండీగఢ్ లోని గురు గోవింద్ సింగ్ కాలేజీలో చేరారు. అనంతరం పంజాబ్ వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. జలంధర్ లో పంజాబ్ టెక్నికల్ వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. చండీగఢ్ లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్ డీ పూర్తి చేసిన ఆయన.. హ్యాండ్ బాల్ క్రీడలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉండటం గమనార్హం. ఈ క్రీడలో ఆయన ఇంటర్ వర్సిటీ స్పోర్ట్స్ మీట్ లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం.

కొద్దిమంది రాజకీయ నేతల మాదిరి జ్యోతిష్యాన్ని బాగా విశ్వసించే చన్నీ రాజకీయాల్లో వెలిగిపోవటానికి పూజలు.. యాగాలు లాంటివి ఎక్కువగా చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ తీరు ఆయన్ను చాలాసార్లు వార్తల్లోకి తీసుకొచ్చేలా చేసింది. ఇక.. చన్నీ పొలిటికల్ కెరీర్ తొలిసారి 2007లో షురూ అయ్యింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా చామ్ కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి 2007లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

2012లో కాంగ్రెస్ లో చేరారు. ఆ ఏడాది.. 2017లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి ముడు మూడుసార్లు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన ఆయన.. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015-16లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన.. 2017 మార్చిలో అమరీందర్ సర్కారులో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఉన్నత పదవుల్లో.. ప్రభుత్వ పోస్టుల్లో దళితులకు అవకాశాలు దక్కటం లేదంటూ సొంత సర్కారు మీదనే నిరసన గళం వినిపించిన ఆయన అసమ్మతి నేతగా ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రిని మర్చాలంటూ కాంగ్రెస్ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచిన నేతల్లో చన్నీ ఒకరు. నమ్మకాలకు పెద్దపీట వేసే చన్నీ.. 2017లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక జ్యోతిష్యుడి సూచన మేరకు చండీగఢ్ లోని తన ఇంటికి తూర్పు దిశగా రాకపోకల కోసం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పార్కులో నుంచి అక్రమంగా రోడ్డును నిర్మించుకున్న ఘన చరిత్ర ఉంది. అయితే.. గంటల వ్యవధిలోనే ఈ రోడ్డును కార్పొరేషన్ అధికారులు మూసివేశారు.

అదే విధంగా మరో జ్యోతిష్యుడి సూచన మేరకు తన ఇంటి ప్రాంగణంలో ఏనుగు మీద ఊరేగిన ఆయన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. 2018లో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణికి అనుచితమైన మెసేజ్ లు పంపినట్లుగా చన్నీమీద ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పంజాబ్ లోని మీ టూ వివాదంలో ఆయన సెంటర్ గా మారారు. అయితే.. ఆరోపణలు వచ్చిన ఐఏఎస్ అధికారిణి మాత్రం ఆయనపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం ఆయన ఈ ఇష్యూ నుంచి కాస్త బయటపడే అవకాశం కలిగింది. కానీ.. ఆయన మీద పడిన మరక మాత్రం పోలేదు.ఈ ఇష్యూకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.