Begin typing your search above and press return to search.

వేల కోట్ల స్కాం ఆ బ్రాంచ్ లోనే ఎందుకు జ‌రిగింది?

By:  Tupaki Desk   |   17 Feb 2018 5:09 AM GMT
వేల కోట్ల స్కాం ఆ బ్రాంచ్ లోనే ఎందుకు జ‌రిగింది?
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోన్న వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ కుంభ‌కోణం రేపుతున్న ప్ర‌శ్న‌లు అన్నిఇన్ని కావు. అన్ని క‌రెక్ట్ గా ఉన్నా సామాన్యుడికి నిత్యం చుక్క‌లు చూపించే బ్యాంకులు.. నీర‌వ్ లాంటోళ్ల‌కు వేలాది కోట్ల రూపాయిల్ని అంత తేలిగ్గా ఎలా ఇచ్చేస్తారు? అన్న ప్ర‌శ్న‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

చిన్న చిన్న విష‌యాల‌కు స‌గ‌టు జీవుల్ని అదే ప‌నిగా బ్యాంకుల చుట్టూ తిప్పించుకునే అధికారులు నీర‌వ్ లాంటోళ్ల విష‌యంలో ఏమైపోయాయి? అన్న సూటి ప్ర‌శ్న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశంలో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ కు భారీ ఎత్తున బ్రాంచ్ లు ఉన్నా.. తాజా కుంభ‌కోణానికి ముంబ‌యి బ్రాడీ హౌజ్ బ్రాంచ్ ను ఎందుకు ఎంపిక చేసుకున్న‌ట్లు? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదే అంశంపై అధికారులు దృష్టి సారించిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కోణంలో విచార‌ణ చేసిన‌ప్పుడు.. నిందితుడు నీర‌వ్ మోడీ చాలా తెలివిగా బ్యాంకును బోల్తా కొట్టించిన‌ట్లు చెప్పాలి. బ్యాంకుకు ఉన్న బ‌ల‌హీన‌త‌ను సొమ్ము చేసుకున్నాడ‌ని చెప్పాలి.

దేశంలోని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ బ్రాంచ్ ల‌ను అన్నింటికి స్విఫ్ట్ కోర్ బ్యాంకింగ్ విధానం ఉంది. ఒక్క ముంబ‌యి బ్రాడీహౌజ్ బ్రాంచ్‌కు మాత్ర‌మే ఈ నెట్ వ‌ర్క్‌కు అనుసంధానం చేయ‌లేదు. దీంతో.. స్విఫ్ట్ ను నిర్వ‌హించే ఇద్ద‌రు కీల‌క ఉద్యోగుల‌ను అవినీతితో ప్ర‌లోభ పెట్టి ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎల్ ఓయూల‌కు 90 రోజుల రోల్ ఓవ‌ర్ టైం ఉంటుంది. చార్జీలు తీసుకుంటూ వీటిని రోల్ ఓవ‌ర్ చేస్తూ వ‌చ్చారు. ఈ బ్రాంచ్‌ కు డీజీఎంగా ఉన్న గోకుల్ నాథ్ శెట్టి అయితే ఏకంగా 365 రోజుల‌కు రోల్ ఓవ‌ర్ చేయ‌టంతో నీర‌వ్ మోడీ దొరికే అవ‌కాశం లేకుండా చేశార‌ని చెబుతున్నారు. ఇదంతా చూస్తున్న‌ప్పుడు ప‌క్కా ప్లానింగ్ తోనే ఈ భారీ కుంభ‌కోణానికి నీర‌వ్ తెర తీసి ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.