Begin typing your search above and press return to search.

వహ్.. పంజాబ్ అట్టడుగు నుంచి.. ప్లేఆఫ్స్‌ రేసులోకి

By:  Tupaki Desk   |   27 Oct 2020 9:30 AM GMT
వహ్.. పంజాబ్ అట్టడుగు నుంచి.. ప్లేఆఫ్స్‌ రేసులోకి
X
సరైన ఆట ఆడలేక ఓడిపోతే ఆడలేకపోయాం..ఓటమి వచ్చిందనే అంతా అనుకుంటారు. కానీ గెలుపంచులదాకా వచ్చి ఓటమి ఎదురైతే మాత్రం అది అంతా ఇంత బాధ కాదు. ఈ ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుది అదే పరిస్థితి. చివరిదాకా గెలుపు తమదే అనుకున్న మ్యాచులు ఎన్నో పోగొట్టుకుంది. ఓ మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్లో ఓటమి చెందాల్సి వచ్చింది. అలా తొలి 7 మ్యాచుల్లో పంజాబ్ ఒక విజయం మాత్రమే సాధించి అట్టడుగు స్థానానికి చేరింది. ఇక అద్భుతాలు చేస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌ చేరుతుందని అంతా అన్నారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్ జట్టు నిజంగానే అద్భుతాలు చేస్తోంది. కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ లో వరుసగా ఐదు విజయాలు సాధించి అబ్బురపరిచింది. రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు.

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్ అద్భుతంగా పుంజుకుంది. గేల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి మ్యాచ్లో మెరుపులు మెరిపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్‌ తర్వాత వరుసగా ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ కు గట్టి పోటీదారుగా మారింది. సోమవారం రాత్రి కోల్‌కతాపై విజయం సాధించిన పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్లు 12 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ అంతరంతో కోల్‌కతాను పంజాబ్ వెనక్కి నెట్టింది. ప్లేఆఫ్ రేసులో నాలుగో స్థానం కోసం జరుగుతున్న పోరులో ఇప్పటి వరకూ కోల్‌కతా ముందుంటూ వస్తుండగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా పంజాబ్ ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజ వేసింది. ఇప్పటికే తొలి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, రెండు మూడు స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు ప్లే ఆఫ్స్ దక్కించుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ కాగా కోల్‌కతా, పంజాబ్ జట్లలో ఒకటే నాలుగో స్థానందక్కించుకోనుంది.రాజస్థాన్ ఈ జట్లకు సమానంగా విజయాలు సాధించినా నెట్ రన్ రేట్ తేడాతో వెనుక బడింది.