Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు శిక్షలేమిటో తెలుసా ?

By:  Tupaki Desk   |   18 July 2022 8:30 AM GMT
ట్రాఫిక్ ఉల్లంఘనలకు శిక్షలేమిటో తెలుసా ?
X
ట్రాపిక్ ఉల్లంఘనలపై పంజాబ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో సుమారు 10 లక్షలమంది చనిపోతున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు బాగా పెరిగిపోతోంది.

ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక నిబంధనలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. ఇందులో భాగంగానే పంజాబ్ ప్రభుత్వం తాజాగా జారీచేసిన నిబంధనలు చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే పంజాబ్ లో ఎవరైనా మద్యంతాగి లేదా అధికవేగంతో వాహనాలను నడుపుతు పట్టుబడ్డారంటే సామాజిక సేవగానీ లేదా రక్తదానం కానీ చేయాల్సుంటుంది. పట్టుబడిన వారికి పై రెండు కార్యక్రమాల్లో ఏదో ఒకటి చేయిస్తునే జరిమానా కూడా విధిస్తారు. ఎవరైనా పరిమితికి మించిన వేగంతో డ్రైవ్ చేస్తు దొరికితే మొదటిసారి వెయ్యి రూపాయలు, రెండోసారి పట్టుబడితే 2 వేల రూపాయలు జరిమానా విధిస్తారు.

ఇదే సమయంలో మద్యం లేదా మత్తుపదార్ధాలు తీసుకుని పట్టుబడితే మొదటిసారి 5 వేలు, రెండోసారి పట్టుబడితే రు. 10 వేలు ఫైన్ కట్టాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారంతా రవాణాశాఖ నిర్దేశించిన కోర్సును తప్పక పూర్తిచేయాల్సుంటుంది. తర్వాత తమకు సమీపంలోనే ఉన్న స్కూలు పిల్లలకు కనీసం 2 గంటలపాటు పాఠాలు చెప్పాల్సుంటుంది. పనిలోపనిగా ఒక ఆసుపత్రిలో 2 గంటలపాటు సామాజికసేవ లేదా ఒక యూనిట్ రక్తదానం చేయాల్సుంటుంది.

ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనలు ఏ మేరకు అమలవుతాయో చూడాల్సిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పంజాబ్ లో మాదకద్రవ్యాల వాడకం చాలా ఎక్కువగా పెరిగిపోతోంది. దేశం మొత్తంమీద అత్యధికంగా మత్తుపదార్ధాల బిజినెస్ జరుగుతున్నది, వాడకం కూడా పంజాబ్ లోనే ఉంటోంది.

పొరుగునే ఉన్న పాకిస్ధాన్ లో నుండి మత్తుపదార్ధాలు విపరీతంగా పంజాబ్ లోకి వచ్చేస్తున్నదని ఇప్పటికే బయటపడింది. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వం కొత్త నిబందనలను తెరపైకి తీసుకొచ్చింది.