Begin typing your search above and press return to search.

పీఆర్సీ పై వీడియో తో పంచ్.. ఇది మాత్రం కచ్ఛితంగా ఓవరే బాస్

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:00 AM IST
పీఆర్సీ పై వీడియో తో పంచ్.. ఇది మాత్రం కచ్ఛితంగా ఓవరే బాస్
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గడిచిన కొంతకాలంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. ఉద్యోగసంఘాలతో భేటీ అయిన సందర్భంగా.. తానేం చేయగలనన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పిన ఆయన.. అందుకు తగ్గట్లే తాజాగా వరాల జల్లు కురిపించారు. అయితే.. సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీ ప్రకటన వరం ఎందుకు అవుతుందన్న ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు 40 శాతం మేర పీఆర్సీని కోరుకుంటే.. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదిక 14.29 శాతం కంటే ఇచ్చేది లేదని పేర్కొంది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. తన చేతికి ఎముక లేదన్నట్లుగావ్యవహరిస్తారని తనను అందరూ అంటుంటారని.. అందుకు తగ్గట్లే తన నిర్ణయం ఉంటుందన్న ఆయన.. 23.29 శాతం పీఆర్సీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు.. ఎవరూ ఊహించని రీతిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. మరిన్ని తీపికబుర్లు చెప్పుకొచ్చారు. అయితే.. ప్రభుత్వ ప్రకటనకు మురిసిపోయినోళ్లు ఉన్నట్లే.. పెదవి విరుస్తున్నోళ్లు కూడా లేకపోలేదు.

జగన్ సర్కారు ప్రకటించిన పీఆర్సీపై సెటైర్ వేసేలా ఒక వీడియో వైరల్ గా మారింది. ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన పాతిక సెకన్ల చిట్టి వీడియో.. ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులు.. పీఆర్సీని.. ఇద్దరు చిన్న పిల్లలు..వారిలో ఒకరు ప్రభుత్వం.. మరొకరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే.. అక్కడున్న ప్లేట్ లో ఉన్న చాక్లెట్లు పీఆర్సీగా పేర్కొన్నారు. ప్లేట్ లో ఉన్న చాక్లెట్లను చిట్టి అమ్మాయి (ప్రభుత్వం) మొత్తం నోట్లో పెట్టేసుకోవటం.. తనకు తినే అవకాశం ఇవ్వని తీరుపై అబ్బాయి (ప్రభుత్వ ఉద్యోగులు) కెవ్వున ఏడవటం.. వాడి నస భరించలేక నోట్లో పెట్టుకున్న చాక్లెట్లలో రెండింటిని తీసి.. ప్లేట్ లో పెట్టి.. వాడ్ని శాంతించమన్నట్లు చూడటం.. అందుకు తగ్గట్లే పిల్లాడు ఓకే అన్నట్లుగా ఊరుకోవటం.. ప్లేట్ లో ఉన్న రెండు చాక్లెట్లను ఒకదాన్ని అమ్మాయి (ప్రభుత్వం) మళ్లీ నోట్లో పెట్టేసుకోవటం.. మిగిలిన ఒక చాక్లెట్ ను అబ్బాయి( ప్రభుత్వ ఉద్యోగుల)తిని గమ్మున ఉండటంతో వీడియో ముగుస్తుంది.

ఈ చిట్టి వీడియో చెప్పేదేమంటే.. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నంత పీఆర్సీ ఇవ్వకుండా హ్యాండిచ్చిందన్నట్లుగా వీడియో ఉంది. అయితే.. ఈ వీడియోను చూసినంతనే నవ్వురావొచ్చు. కానీ..వాస్తవిక కోణంలో చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నంత పీఆర్సీ ఇస్తే.. రాష్ట్ర ఖజానా మీద పడే భారం భారీగా ఉంటుంది. ఎక్కడి వరకో ఎందుకు? తాజాగా జగన్ సర్కారు ప్రకటించిన 23.29 శాతం పీఆర్సీ కారణంగా రాష్ట్ర ఖజానా మీద పడే భారం.. ఏకంగా రూ.10,247 కోట్లు. అంటే.. దగ్గర దగ్గర ప్రతి నెలా వెయ్యి కోట్ల రూపాయిల వరకు అదనపు భారం పడినట్లే.

ఇప్పటికే ఆదాయం తగ్గి.. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మరో రూ.10వేల కోట్ల భారం ప్రభుత్వం తన మీద వేసుకున్న తర్వాత కూడా ఈ తరహా కామెడీ వీడియోను వైరల్ చేయటం మాత్రం అతే అవుతుంది బాస్. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతాలు పెంచినా.. వారు చేసేది చేస్తూనే ఉంటారన్న అసలు విషయాన్ని మాత్రం మర్చిపోలేం.