Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా నుంచి గోదార‌మ్మ ఒడికి వ‌చ్చే చేప!

By:  Tupaki Desk   |   27 Aug 2019 6:54 AM GMT
ఆస్ట్రేలియా నుంచి గోదార‌మ్మ ఒడికి వ‌చ్చే చేప!
X
పుల‌స‌.. ఈ పేరు విన‌గానే ఆహా.. ఏమి రుచి అంటాం. ఈ చేప రుచి ఎంత ప్ర‌త్యేక‌మో దాని మ‌నుగ‌డ స‌మ‌రంలో అంత‌కుమించిన ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. కానీ మ‌న‌లో చాలామందికి దాని పుట్టుక‌ - పున‌రుత్ప‌త్తి - మ‌నుగ‌డ కోసం సాగించే పోరాటం గురించి తెలియ‌దు. పుల‌స వ‌ల‌స గురించి అంత‌క‌న్నా తెలియ‌దు.. ఖండాంత‌రాలు దాటి మ‌న గోదార‌మ్మ ఒడికి చేరి - పున‌రుత్ప‌త్తి త‌ర్వాత తిరిగి వెళ్లే అరుదైన అంశం ఎప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ స‌ముద్ర‌జ‌లాల్లో ఉండే పుల‌స‌కు మ‌న గోదార‌మ్మ‌కు ఏమిటి సంబంధం.. ఎక్క‌డిదీ ఈ బంధం అని ఆశ్చ‌ర్య‌పోతాం.

సుమారు 11వేల నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఉండే పుల‌స‌ల జ‌న్మ‌స్థానం మాత్రం మ‌న గోదావ‌రే. అది ఎలాగే ఈ క‌థ‌నంలో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.. ఈ పుల‌స చేప‌లు.. పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌ తదితర దేశాల సముద్ర జలాల్లో జీవిస్తాయి. శాస్త్ర‌ప‌రంగా.. క్యుఫిడే కుటుంబానికి చెందిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. పులస ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ‘ఇల్సా’ కాస్తా సముద్రంలో ఉన్నప్పుడు ‘విలస’గా.. గోదావరి పాయ‌ల్లోకి ప్రవేశించాక ‘పులస’గా మారుతుంది.

అయితే.. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ స‌ముద్ర జ‌లాల నుంచి సుమారు 11వేల నాటిక‌ల్ మైళ్ల దూరం 30 నుంచి 40 రోజులు ప్ర‌యాణిస్తాయి. ఈ ప్ర‌యాణం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటంటే.. పునరుత్పత్తి. అంటే ఇవి పసిఫిక్‌ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం - బంగాళాఖాతం మీదుగా గోదావరి పాయ‌ల్లోకి వ‌స్తాయి. అయితే ఈ చేప‌లు ఏడాది పొడ‌వునా గోదావ‌రిలోకి రావు.. కేవ‌లం ఎక్కువ‌గా వ‌ర‌ద వ‌చ్చే ఆగ‌స్టు - సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో మాత్ర‌మే అవి వ‌స్తాయి. గోదావరి నదికి ఎర్రటి రంగులో ఉండే వ‌ర‌ద‌ వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి.

ఆడ - మగ పులసలు గోదావరిలో ఇసుక - గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లోనే చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను ‘జట్కా’ అని పిలుస్తారు. పునరుత్పత్తి త‌ర్వాత‌ వచ్చిన సముద్ర మార్గంలోనే పిల్ల‌ల‌తో కలిసి తిరిగి వచ్చిన చోటకే వెళ్లిపోతాయి. ఈ క్ర‌మంలోనే వీటిల్లో కొన్ని గోదావరిలో మ‌త్స్య‌కారుల‌ వలలకు చిక్కి - సిరులు కురిపిస్తాయి. అయితే.. ఇవి గోదావ‌రిలో ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ దొర‌క‌వు. కేవ‌లం ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి - వృద్ధ గౌతమి - వైనతేయ - వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి.

ఇక్క‌డ పుల‌స చేప‌ల‌కు ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. గోదావ‌రి వ‌ర‌ద‌కు అవి సుమారు 100కిలోమీట‌ర్ల వేగంతో ఎదురీద‌డం. సాధార‌ణంగా గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయట‌. అయితే.. ఇక్క‌డే వాటిలో కీల‌క‌మైన ర‌సాయ‌నిక చ‌ర్య‌లు జ‌రిగి వాటి కండ‌రాల్లో ప్రొటీన్లు ఉత్ప‌త్తి అవుతాయి. పులసలకు స్వేదగ్రంధులు ఉండవు. మామూలుగా చేపల్లో ఒమేగా–3 పేట్రియాసిడ్స్‌ (ఆమ్లాలు) ఉంటాయి. కానీ ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని - అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. అందుకే పుల‌స‌ను క్వీన్ ఆఫ్ ది ఫిష్‌ గా పిలుస్తారు. పుల‌సా మ‌జాకా..!