Begin typing your search above and press return to search.

గోదావ‌రిలో ఆ చేప క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దేనా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 12:30 AM GMT
గోదావ‌రిలో ఆ చేప క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దేనా?
X
పుస్తెలు అమ్ముకునైనా పుల‌స తినాల‌ని నానుడి. దీన్నిబ‌ట్టే తెలుసుకోవ‌చ్చు... పుల‌స‌కు ఉన్న రుచి ఎలాంటిదో.. చేప‌ల్లో దాని స్థాయి ఎలాంటిదో. గోదావ‌రికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు దానికి ఎదురీదుతూ వెళ్లే ఇల‌స చేప‌లే పుల‌స‌లుగా మార‌తాయ‌ని అంటున్నారు. సముద్రంలో ఉండే ఇలస (హిల్స) చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి.

సాధార‌ణంగా జూలై - ఆగ‌స్టు నెల‌ల మ‌ధ్య పుల‌స‌ల సీజ‌న్ అని చెబుతున్నారు. అయితే ఆగ‌స్టు నెల చివ‌ర‌కు వ‌స్తున్నా ఇంత‌వ‌ర‌కు పుల‌స‌ల ఆచూకీ లేక అటు మ‌త్య్స‌కారులు, ఇటు పుల‌స చేప ప్రియులు నిట్టూరుస్తున్నారు. పులసల సీజన్‌లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింద‌ని అంటున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్త‌డంతో పుల‌స‌లు గోదావ‌రికి ఎదురీద‌లేక పోయాయ‌ని చెబుతున్నారు.

గోదావ‌రికి భారీ వ‌ర‌ద రావడంతో ఈసారి పుల‌స‌లు ల‌భించ‌లేద‌ని మ‌త్స్యకారులు చెబుతున్నారు. ఈసారి గోదావ‌రికి భారీ స్థాయిలో వ‌ర‌ద ప్ర‌వాహం వ‌చ్చింది. గ‌త 30 ఏళ్ల‌లో లేనంతగా వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ల‌క్ష‌ల క్యూసెక్కుల్లో వ‌చ్చిన వ‌ర‌ద ప్ర‌వాహానికి ఎదురీద‌లేక పుల‌స‌లు ల‌భించడం లేద‌ని మ‌త్స్య శాఖ అధికారులు, మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఆందోళ‌న చెందుతున్నార‌ని అంటున్నారు.
య‌మ‌బ‌డ‌గ‌

గోదావ‌రికి భారీగా వ‌ర‌ద రావ‌డం, అది త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతుండ‌టంతో ఇల‌స‌లు గోదావ‌రికి ఎదురు ఈద‌లేక వెన‌క్కి వెళ్లిపోతున్నాయ‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయ‌ని అంటున్నారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటేనే సముద్రం వైపు నుంచి ఇలసలు గోదావరికి ఎదురు ఈద‌గ‌ల‌వ‌ని అంటున్నారు. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి ఆగ‌స్టు 20 వరకు రోజూ 10 లక్షల క్యూసెక్కులకు తక్కువ కాకుండా వ‌ర‌ద ప్ర‌వాహాన్ని దిగువ‌కు విడిచిపెట్టార‌ని అంటున్నారు.
ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయ‌ని పేర్కొంటున్నారు. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే నదీ ముఖద్వారం వద్ద మొగలు పూడుకుపోవడం కూడా పులసల‌ రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని చెబుతున్నారు.

కాగా పుల‌స‌లు లభించ‌కపోవ‌డంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న ఇలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నార‌ని చెబుతున్నారు. ఒడిశా నుంచి తూర్పుగోదావ‌రి, కోన‌సీమ‌ జిల్లాల్లో ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్‌లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నార‌ని అంటున్నారు. అర కిలో ఇలస రూ.1,000 నుంచి రూ.1,500 వ‌ర‌కు అమ్ముడ‌వుతోంద‌ని తెలుస్తోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు చేసేదేమీ లేక ఇల‌స‌తోనే సర్దుకుపోతున్నార‌ట‌.

గ‌తంలో గోదావరిలో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల్లో దొరికేవి. కిలో రూ.10 వేలకు పైనే పలికేదని అంటున్నారు.