Begin typing your search above and press return to search.

సెంచరీలు కొట్టాడు.. చోటు పట్టాడు..

By:  Tupaki Desk   |   23 May 2022 3:00 AM GMT
సెంచరీలు కొట్టాడు.. చోటు పట్టాడు..
X
టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారా మళ్లీ టీమిండియాలోకి వచ్చేశాడు. రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి.. జాతీయ జట్టులో చోటు కోల్పోయి.. జీల్లోనూ పెద్దగా రాణించలేకపోయిన పుజారా.. అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక పనైపోయింది అనుకుంటున్న స్థితిలో పుజారాకు ఆటగాడిగా ఇది మరో జన్మే.

వాస్తవానికి పుజారా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. పదుల కొద్దీ బ్యాట్స్ మెన్ టెస్టు జట్టు రేసులో ఉన్నారు. వీరిలో తెలుగు ఆటగాడు హనుమ విహారి ముందువరుసలో ఉన్నాడు. కానీ, చతేశ్వర్ పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అయితే, ఇదేమంత సులువుగా సాధ్యం కాలేదు.

ఇంగ్లండ్ అనుభవం కలిసొస్తుందని..

గతేడాది ఇంగ్లాండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టుతో పాటు జూన్ లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమ్ఇండియా జట్లను బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాకు దక్షిణాఫ్రికా సిరీస్ కు విశ్రాంతినిచ్చింది. పుజారాను తీసుకుని అజింక్య రహానెను పరిగణించలేదు. కాగా, పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉన్నాడు.

అక్కడి కౌంటీ జట్టు ససెక్స్ తరఫున ఆడుతున్నాడు. దీంతో కీలకమైన ఐదో టెస్టుకు పుజారాను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ పిచ్ లపై ఆడడమంటే మామూలు మాటలు కాదు. కుర్రాళ్లకు మరీ క్లిష్టం. అందుకనే అనుభవం ఉన్న పుజారాను తీసుకున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా ఇంగ్లండ్ లో ససెక్స్ కు ఆడుతుండడం
కూడా పుజారాకు కలిసొచ్చింది.

2 డబుల్ సెంచరీలు.. 2 సెంచరీలు

టీమిండియాలో చోటు కోల్పోయి.. దేశవాళీ రంజీల్లోనూ రాణించని పుజారా.. ససెక్స్ తరఫున ఆడాలని అనుకోవడం అతడి కెరీర్ ను నిలబెట్టింది. వాస్తవానికి పుజారా గతేడాది రంజీల్లో నామమాత్ర ప్రదర్శనే చేశాడు. అయితే, ఏప్రిల్ ససెక్స్ కు ఆడేందుకు వెళ్లాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా సెంచరీ బాదేశాడు. తదుపరి మ్యాచ్ లో సెంచరీ, ఆ తర్వాతి మ్యాచ్ లో డబుల్ సెంచరీ కొట్టాడు. మరుసటి మ్యాచ్ లో 170 పరుగుల భారీ శతకం చేశాడు. దీంతో పుజారా తిరిగి గాడినపడినట్లేనని సెలక్టర్లకు నమ్మకం వచ్చింది.

అతడు నిలిస్తే రోహిత్ కు , జట్టుకూ మేలు

పుజారా వైఫల్యం అతడికి వ్యక్తిగతంగానే కాక కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు అంతకుమించి జట్టుకు ఎంతో మేలు. ఫామ్ కోల్పోయినంత మాత్రాన వన్ డౌన్ లో సాలిడ్ గా నిలిచే పుజారాను ఎప్పటికీ తక్కువ చేయలేం. అందులోనూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏమాత్రం ఫామ్ లో లేని ఈ సమయంలో పుజారాను వదులుకోవడం పొరపాటే అవుతుంది.

ఎంత స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉన్నా.. చతేశ్వర్ స్థాయే వేరు. అందుకనే సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. పుజారా రాణిస్తే రోహిత్ పై కెప్టెన్ గా భారం తగ్గుతుంది. దీంతోపాటు టెస్టు చాంపియన్ షిప్ లో ముందుకెళ్లాలంటే పుజారా వంటివాడు అత్యంత కీలకం. మరి ఈ అవకాశాన్ని నిలుపుకోవడం అతడి చేతుల్లోనే ఉంది.