Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నగరంలో 16 మంది మహిళల్ని చంపిన సైకో!

By:  Tupaki Desk   |   26 Jan 2021 9:00 AM IST
హైదరాబాద్ నగరంలో 16 మంది మహిళల్ని చంపిన సైకో!
X
కారణం తెలీదు. ఎందుకలా చేస్తున్నాడన్న విషయం ఇంకా బయటకు రాలేదు కానీ.. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక వ్యక్తి.. ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసుకొని చంపేసే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. రాచకొండ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పలు ప్రశ్నలకు కారణమవుతోంది. తాజాగా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడ్ని విచారిస్తున్నాడు. అతడు చెప్పిన ఆధారాల ప్రకారం వెతుకుతున్నారు.

ఈ నెల మొదటివారంలో నగర శివారులోని అంకుషాపూర్ వద్ద సగం కాలిన మహిళ డెడ్ బాడీ లభించింది. ఆమెకు సంబంధించిన సమాచారం దొరకలేదు. దారుణంగా హతమార్చి గుర్తుపట్టకుండా మొహం మీద పెట్రోల్ పోసి తగలబెట్టటంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే ఆమె చీర చెంగుకు ఒక ముడి ఉండటం.. అందులోని ఒక చిటీలో ఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

ఆ ఫోన్ నెంబరు నేరేడ్ మెట్ కు చెందిన వ్యక్తిదిగా గుర్తించి.. విచారణ షురూ చేశారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. కాకపోతే ఆమె పేరు వెంకటమ్మ అని.. జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో నివాసం ఉండేదని చెప్పారు. దీంతో రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసుల్ని సంప్రదించారు. ఆమె జనవరి ఒకటిన మిస్ అయినట్లుగా జూబ్లీహిల్స్ స్టేషన్ లో కేసు నమోదై ఉంది. అదే రోజు మధ్యాహ్నం బేగంపేటలో ఆమె పోన్ స్విచ్ఛాప్ అయినట్లుగా గుర్తించారు. ఒకచోట ఆమె.. ఒక వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్లు గుర్తించారు.

ఆ వ్యక్తి ఫోటోను సంపాదించిన పోలీసులు.. వెంకటమ్మ కుటుంబ సభ్యులకు చూపించగా.. తమకు తెలీదన్నారు. దీంతో.. మళ్లీ మొదటికి వచ్చిన ఈ కేసు లెక్క తేల్చేందుకు నగరమంతా పోలీసులు గాలించారు. చివరకు ఒక చేపల వ్యాపారి ఆ ఫోటోను చూసి గుర్తుపట్టాడు. అతడ్ని తాను బోరబండలో చూసినట్లు వెల్లడించాడు. దీంతో.. జల్లెడపల్లిన పోలీసులు ఎట్టకేలకు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. షాకింగ్ నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

కల్లు కాంపౌండ్.. మద్యం దుకాణాలు ఇతరత్రా వద్ద ఒంటరిగా కనిపించిన మహిళల్ని తాను హత్య చేశానని.. ఇప్పటివరకు పదహారు మందిని చంపినట్లుగా వెల్లడించాడు. అతను చెప్పిన ఆధారాలతో పోల్చిన పోలీసులు.. ప్రాథమికంగా పదహారు మందిని చంపినట్లుగా తేల్చారు. అతడ్ని విచారిస్తున్నారు. మరిన్ని షాకింగ్ అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.