Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డు ఛైర్మన్ సెన్సేషన్ కామెంట్స్

By:  Tupaki Desk   |   9 Jun 2016 6:01 AM GMT
సెన్సార్ బోర్డు ఛైర్మన్ సెన్సేషన్ కామెంట్స్
X
కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రహ్లాజ్ నిహ్లాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న విమర్శల్ని అంగీకరిస్తూ.. ‘‘ఔను నేను మోడీ భక్తుడినే. నేను మోడీ చెంచానే’’ అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. ‘‘నేను భారతీయుడిని. మా ప్రధానిని నేను అనుసరిస్తాను’’ అని.. ‘‘మోడీజీని నేను ఆరాధిస్తాను. ఆయన విజన్ మీద.. ఆయన దేశానికి చేస్తున్నదాని మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. మోడీ ప్రధాని కాకముందే ఆయన సాధించిన విజయాల మీద ఓ వీడియో రూపొందించాను. అందుకు నేను గర్విస్తాను. మోడీ చెంచా అనిపించుకోవడానికి కూడా నేను గర్విస్తాను. మరి నేను ఇటాలియన్ ప్రధాని చెంచాగా ఉండాలని అంటారా?’’ అని నిహ్లాని కుండబద్దలు కొట్టారు.

నిహ్లాని సెన్సార్ బోర్డు ఛైర్మన్ అయ్యాక అనేక వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాల సెన్సార్ విషయంలో నిహ్లాని చాలా కఠినంగా వ్యవహరిస్తుండటంతో.. ఆయన ఆర్ ఎస్ ఎస్ విధానాల్ని అమలు చేస్తున్నాడని.. సినిమా స్వేచ్ఛను చంపేస్తున్నాడని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. గత ఏడాది జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’లో ముద్దు సీన్ల నిడివి తగ్గించినపుడు ఆయనపై చాలా సెటైర్లు పడ్డాయి. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాల సెన్సార్ విషయంలో ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు. ‘ఉడ్తా పంజాబ్’ సినిమా విషయంలో నిహ్లాని వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 40 కట్స్ చెప్పిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్.. నిహ్లాని మీద విరుచుకుపడుతున్నాడు. ఈ ఇష్యూలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కూడా జోక్యం చేసుకుంటూ నిహ్లానిని మోడీ చెంచా అని.. మోడీ భక్తుడని విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నిహ్లాని పై వ్యాఖ్యలు చేశాడు. కశ్యప్ ఆరోపణలు గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు కశ్యప్ వ్యక్తిగతంగా తెలియదు. నేను నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా. వారి ఉద్దేశాల ప్రకారం పని చేయనందుకు నేను తప్పుకోవాలంటున్నారు. ప్రభుత్వం కూడా అదే కోరుకుంటే నేను అలాగే చేస్తా’’ అన్నాడు. ఉడ్తా పంజాబ్ సినిమాకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పాన్సర్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని నిహ్లాని వ్యాఖ్యానించడం విశేషం.