Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే.. కేంద్రం ముందుకే..

By:  Tupaki Desk   |   24 Feb 2021 2:30 PM GMT
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే.. కేంద్రం ముందుకే..
X
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న ఆందోళనలను అస్సలు పట్టించుకోవడం లేదు. విశాఖపట్నం ప్రజలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల నిరసనలు.. ఆందోళనలను లైట్ తీసుకుంటోంది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రణాళికతోనే ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం. సాంకేతిక వివరాలు, ప్లాంట్ సామర్థ్యం.. దాని ఆస్తులను బిడ్ పత్రంలో చేర్చడానికి సమర్పించాలని పరిశ్రమల శాఖను పిలుపునిచ్చినట్టు తెలిసింది..

వివరాలు అందిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ప్రైవేటు సంస్థలను పిలవాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఆసక్తి గల పారిశ్రామిక సంస్థలు బిడ్ వేయాలని కేంద్రం పిలుస్తుందని వర్గాలు తెలిపాయి.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకున్న చర్యను ఏపీలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రైవేటీకరించే ప్రణాళికను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ ప్రణాళికను నిలిపివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జగన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయగా, ఆయన మంత్రివర్గం మంగళవారం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించింది.

అయినప్పటికీ, కేంద్రం ఏపీలో జరుగుతున్న ఆందోళనలను, పార్టీల ప్రయత్నాలను లైట్ తీసుకుంటున్నట్టు కనబడుతోంది. ఉక్కు కర్మాగారాన్ని వదిలించుకోవడానికి.. ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికి కేంద్రం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.