Begin typing your search above and press return to search.

థియేట‌ర్‌ కు నిప్పు.. మాల్ మీద దాడి!

By:  Tupaki Desk   |   24 Jan 2018 5:21 AM GMT
థియేట‌ర్‌ కు నిప్పు.. మాల్ మీద దాడి!
X
ప‌ద్మావ‌త్ అలియాస్ ప‌ద్మావ‌తి మూవీ రేపిన వివాదం అంతా ఇంతా కాదు. త‌మ మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా సినిమా ఉంద‌న్న ఆందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కాదు.. ఈ సినిమా విడుద‌లైతే థియేట‌ర్ల మీద దాడులు చేస్తామ‌ని ఒక‌రంటే.. ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల ఎదుట 2వేల మంది ఆత్మాహుతికి పాల్ప‌డ‌తామ‌న్న బెదిరింపు మ‌రికొంద‌రు చేసిన ప‌రిస్థితి. విడుద‌ల విష‌యంలో వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వచ్చిన ఈ మూవీ ఈ నెల 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను వ్య‌తిరేకిస్తున్న వారు హింస‌కు తెగ‌బ‌డ్డారు. గుజ‌రాత్ లో ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో అల్ల‌ర్లు చెల‌రేగాయి. ఈ సినిమాను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ.. ఈ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తే దారుణ ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని హెచ్చ‌రించిన క‌ర్ణిసేన అన్నంత ప‌ని చేసింది.

గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో సినిమాను ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్లు.. షాపింగ్ మాల్స్ పై దాడుల‌కు దిగారు. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒక సినిమా థియేట‌ర్‌ కు నిప్పు పెట్టేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. థియేట‌ర్ బ‌య‌ట ప్ర‌దేశాల్లో ఉన్న వాహ‌నాల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. ఆయుధాల‌తో రోడ్ల మీద హ‌ల్ చ‌ల్ చేశారు. వీరంతా క‌ర్ణి సేన‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. ప‌ద్మావ‌త్ సినిమా విడుద‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ఆందోళ‌న‌లు మాత్ర‌మే సాగ‌గా.. ఇప్పుడ‌వి అదుపు త‌ప్పి అల్ల‌ర్లు.. హింస చెల‌రేగటంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఆందోళ‌నాకారుల్ని చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌ద్మావ‌త్ సినిమాకు వ్య‌తిరేకంగా పెరుగుతున్న దాడులను అరిక‌ట్టే విష‌యంపై గుజ‌రాత్ డీజీపీ అత్య‌వ‌స‌రంగా ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల్ని రంగంలోకి దించారు. సినిమా ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. తాజా అల్ల‌ర్ల‌పై గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి రూపానీ రియాక్ట్ అయ్యారు. ప్ర‌జ‌లు శాంతిని పాటించాల‌ని విన్న‌వించారు.

ప‌ద్మావ‌త్ నిర‌స‌న సెగ గుజ‌రాత్‌ కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. ఈ చిత్రానికి వ్య‌తిరేకంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. హ‌ర్యానా.. ఢిల్లీలో క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌ల‌కు దిగారు. భార‌త సిలిక్యాన్ వ్యాలీగా చెప్పే గురుగ్రామ్ లో అల్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకురావ‌టానికి 144సెక్ష‌న్ ను జారీ చేశారు. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో.. చాలామంది థియేట‌ర్ య‌జ‌మానులు.. త‌మ థియేట‌ర్ల బ‌య‌ట తాము ప‌ద్మావ‌త్ మూవీని ప్ర‌ద‌ర్శించ‌టం లేదంటూ బోర్డులు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని థియేట‌ర్ల‌పై దాడుల‌కు దిగుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.