Begin typing your search above and press return to search.

అమెరికా - తుదిదశలో హెచ్4 వీసా రద్దు!

By:  Tupaki Desk   |   25 May 2018 7:47 AM GMT
అమెరికా - తుదిదశలో హెచ్4 వీసా రద్దు!
X
భారతీయుల అమెరికా ఆశలు అడియాసలు కాబోతున్నాయి.. హెచ్4 వీసాను రద్దు చేసే ప్రక్రియను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియ చివరి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ హెచ్ 4 వీసాను రద్దు చేయాలన్న నియమం తుదిదశలో ఉందని ట్రంప్ పరిపాలన విభాగం అమెరికా కోర్టు కు తెలియజేసింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమెరికాలో అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంటుంది.

* హెచ్4 వీసా అంటే ఏంటి.?

అమెరికాలోని భారత ఐటీ నిపుణులు అక్కడ పనిచేయడానికి అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాలు ఇస్తుంటుంది. వారు ఎన్ని ఏళ్లయినా దీంతో పనిచేయవచ్చు.. అయితే ఈ ఐటీ నిపుణుల భార్యలు/భర్తలకు ఇచ్చే స్పౌస్ వీసానే హెచ్4 వీసా అంటారు.. ఈ వీసాలను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రద్ధయితే అమెరికాలో ఉన్న ఐటీ నిపుణుల భార్యలు, భర్తలు ఉద్యోగాలు కోల్పోతారు. ఒక్కరి సంపాదనే దిక్కవుతుంది. దీంతో భారతీయులు హెచ్4 వీసా రద్దును వ్యతిరేకిస్తున్నారు..

*70వేలమంది ఇండియన్స్ ఇంటికే..

హెచ్1బీ వీసాలు పొందిన నిపుణులైన వీసాదారుల భార్యలు కూడా అమెరికాలో చట్టబద్దంగా ఉద్యోగాలు చేసుకోవడానికి గత బరాక్ ఒబామా ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)ని ప్రవేశపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో హెచ్ 4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఇచ్చే అనుమతులు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే హెచ్1బీ, హెచ్4 వీసాలు ఎక్కువగా పొందిన భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రంప్ నిర్ణయంతో దాదాపు 70వేల మంది హెచ్4 వీసాదారుల ఆశలు ఆవిరవ్వబోతున్నాయి.