Begin typing your search above and press return to search.

పెళ్లెప్పుడువుతుంది ప్రసాదూ..?

By:  Tupaki Desk   |   15 July 2022 11:30 PM GMT
పెళ్లెప్పుడువుతుంది ప్రసాదూ..?
X
తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సినిమాల్లో అలనాటి మల్లీశ్వరే కాదు.. 2004లో విడుదలై న మల్లీశ్వరి కూడా ఒకటి. వాస్తవానికి కొత్త మల్లీశ్వరిని సినిమా థియేటర్ లలో కంటే ప్రేక్షకులు టీవీల్లో మరింత ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ సినిమా టీవీల్లో వచ్చిందో...? అయినా ఇంటిల్లిపాదీ చూసేస్తుంటారు.

చక్కటి హాస్యంతో కూడిన సినిమా కావడంతో ఇంత ఆదరణ దక్కింది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్ర పేరు "ప్రసాద్". ఆయనకు 30 ఏళ్లు వచ్చినా వివాహం కాదు. దాన్ని పట్టుకుని "పెళ్లి కాని ప్రసాద్" గా ఆయన బ్యాంకులో పనిచేసే వారు పిలిచేవారు. ఇదంతా వెంకటేష్ కు ఇరిటేషన్ గా ఉండేది. అలాంటి సమయంలో మల్లీశ్వరి (కత్రినా కైఫ్) పరిచయం కావడంతో ప్రసాద్ జీవితం అంతా మారిపోతుంది. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు దేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు.

ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వే స్పష్టం చేసింది. జాతీయ యువజన విధానం 2014 ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు వారిని యువతి అని నిర్వచనం చెప్పారు. ఈ వయసు వారిలో 2011 లెక్కల ప్రకారం అవివాహితుల శాతం 17.2 మాత్రమే. అదే 2019 నాటికి 23 శాతానికి పెరిగింది. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే అవివాహితుల సంఖ్య పెరగడం గమనార్హం. అబ్బాయిల్లో పెళ్లి కానివారు 2011లో 20.8 శాతం నుంచి ఎనిమిదేళ్లలో 26.1 శాతానికి చేరింది. కానీ, అమ్మాయిల్లో 13.5 శాతం నుంచి 19.9 శాతానికి పెరిగింది. అంటే.. ఆరు శాతం లోపే. వాస్తవానికి శాతం ప్రకారం అబ్బాయిులు-అమ్మాయిల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకున్నా మన సమాజ పరిస్థితుల ప్రకారం చూస్తే ఇది ఎక్కువే.

బాలికా వివాహాలు తగ్గాయి.. గుడ్ న్యూస్ యూపీ, జమ్ము కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అవివాహిత యువత సంఖ్య అధికంగా ఉందని.. కేరళ, తమిళనాడు, ఏపీ, హిమాచల్, మధ్యప్రదేశ్ లలో తక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వే స్పష్టం చేస్తోంది. ఎందుకనో.. వివాహ ఆలస్యంపై కారణాలను ఈ సర్వే వివరించలేదు. ఇక భారత్ లో అతి పెద్ద జాఢ్యం బాల్య వివాహాలు. ఇందులోనూ అమ్మాయిలకు చిన్న/తక్కువ వయసులోనే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ, మారిన పరిస్థితుల ప్రభావమో, విద్యకు ప్రాధాన్యం పెరగడమో ఏమో కానీ.. చిన్న వయసులో బాలికల వివాహాలు తగ్గాయని సర్వే వెల్లడించింది.2005-06లో 15 నుంచి 19 ఏళ్ల వయసు బాలికలు/యువతుల్లో 11.9 శాతం మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. 2019-21కి వచ్చేసరికి ఈ శాతం 1.7 శాతానికి పడిపోయింది.

చదువు, కొలువు.. సహ జీవనం చదవు, ఉద్యోగాలు, వృత్తులపై దృష్టి పెట్టి దేశంలోని యువత పెళ్లి పై పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. పెళ్ళి కాని ప్రసాదులు పెరిగిపోతున్నారంటే అర్ధం పెళ్ళి కాని అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లే. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అవివాహితుల సంఖ్య తక్కువగానే ఉంది. వివాహాలు ఆలస్యం కావటానికి లేదా అసలు వివాహాలంటే ఇష్టపడకపోవటానికి పైన చెప్పిన కారణాలతో పాటు లివ్ ఇన్ రిలేషన్ సంస్కృతి కూడా పెరుగుతుండటంతో పాటు సింగిల్ పేరెంటింగ్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు.

మెట్రో నగరాలైన ముంబాయి, బెంగుళూరు, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో లివ్ ఇన్ రిలేషన్ సంస్కృతి పెరిగిపోతోందట. పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువైపోతున్న కారణంగా యువత ఆలోచనలు కూడా చాలా వేగంగా మారిపోతోందట. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాల్లో యువత వివాహాలు చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా అంటే అర్ధం ఇంట్లో పెద్దవాళ్ళ నిర్ణయాలను ఆమోదించటమే. యువతకు ఆర్ధికంగా పూర్తి స్వాతంత్ర్యం వచ్చేస్తుండటంతో చాలా కుటుంబాల్లోని పెద్దవాళ్ళు పిల్లల వివాహాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చేస్తున్నారట. దాంతోనే వివాహాలు ఆలస్యమవటమో లేదా విముఖత పెరిగిపోవటమే జరుగుతోందని అధ్యయనంలో తేలింది.