Begin typing your search above and press return to search.

హెచ్‌-1బీ వీసాలపై నిషేధం ... ఎత్తివేత విషయంలో బైడెన్‌ సర్కారు వెనక్కి?

By:  Tupaki Desk   |   3 March 2021 8:30 AM GMT
హెచ్‌-1బీ వీసాలపై  నిషేధం ... ఎత్తివేత విషయంలో  బైడెన్‌ సర్కారు వెనక్కి?
X
హెచ్‌-1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో జో బైడెన్ ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గినట్లు సమాచారం. వేలాది మంది ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని ఇప్పట్లో తొలగించే అవకాశాలు లేవని అమెరికా అంటోంది. ఈ విషయంలో బైడెన్ సర్కారు వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి నెలలో పదవి నుంచి తొలగిపోయే ముందు.. హెచ్‌-1బీ వీసాలపై నిషేధం విధించారు. దానిని ఎత్తివేస్తామని అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. ట్రంప్‌ తెచ్చిన కొన్ని నిబంధనలను క్రమంగా ఎత్తివేశారు. అందులో ముఖ్యమైనవి.. గ్రీన్‌ కార్డులపై, ముస్లిం వీసాలపై, ముస్లిం దేశస్థులపై ఉన్న నిషేధాలను ఎత్తివేయడం.

అయితే.. వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాల జారీపై నిషేధాన్ని ఇంకా ఎత్తివేయాల్సి ఉంది. దీనిపై బైడెన్‌ సర్కారు ఇంకా ఆలోచన చేస్తూనే ఉంది. తమ ముందు మరిన్ని ముఖ్యమైన అంశాలున్నాయని వ్యాఖ్యానించిన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో యమోర్కాస్, నిషేధం ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదన్న సంకేతాలిచ్చారు. తాము ప్రస్తుతం శరణార్థుల సమస్యల పరిష్కారంతో పాటు, చట్టవిరుద్ధంగా తమ తల్లిదండ్రులతో దేశానికి వచ్చిన వారిని ఆదుకోవడం, వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారంపై దృష్టిని సారించామని ఆయన స్పష్టం చేశారు. హెచ్1-బీ వీసాలపై నిషేధం తొలగిస్తే, అమెరికన్లలో వ్యతిరేకత రావచ్చని బైడెన్ భావిస్తుండటమే ఇందుకు కారణం. హెచ్‌-1బీల జారీపై ట్రంప్‌ విధించిన నిషేధం ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి వచ్చిన హెచ్‌1-బీ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.