Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లకు ప్రియాంక వార్నింగ్

By:  Tupaki Desk   |   5 Nov 2019 10:47 AM IST
ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లకు ప్రియాంక వార్నింగ్
X
మారిన కాలానికి తగ్గట్లు.. ప్రజల మైండ్ సెట్ కు తగ్గట్లు తీరు మార్చుకోని పార్టీలకు ప్రజల నుంచి తిరస్కరణ తప్పదు. దేశంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమున్న దీన స్థితికి కారణం.. దేశ ప్రజల్లో వచ్చిన మార్పుతో పాటు.. తమ విధానాల విషయంలో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కూడా తమను అధికారానికి దూరం చేస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించటం లేదు.

దేశంలో మెజార్టీలైన హిందువులు తమకు గుర్తింపు కోరుకుంటున్నారు. గతానికి భిన్నంగా హిందూ ఓటు బ్యాంకు ఒకటి తయారు కావటమే కాదు.. రోజులు గడిచే కొద్దీ అది అంతకంతకూ బలపడుతోంది. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీల ప్రయోజనాల్ని కాపాడటంలో వైఫల్యం చెందిందన్న భావనే కాంగ్రెస్ పార్టీ తాజా దీనస్థితికి కారణంగా చెప్పక తప్పదు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి ప్రజలు నీరాజనం పట్టిన వైనం చూసినప్పుడు.. దేశ ప్రజల మనోగతం ఏమిటన్న విషయంపై క్లారిటీ వచ్చేసిందని చెప్పక తప్పదు.


ఇంత జరుగుతున్నా ఆర్టికల్ 370 నిర్వీర్యంపై దేశ ప్రజల ఆలోచనలు.. భావోద్వేగాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించటంలోనూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా అత్యధికులు సానుకూలంగా స్పందించటమే కాదు.. దశాబ్దాల క్రితం జరిగిన ఘోర తప్పిదాన్ని మోడీ పరివారం సరిదిద్దిందన్న భావన వ్యక్తమైంది.

జాతి జనుల మూడ్ ను గుర్తించటంలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ అధినాయకత్వం.. కాంగ్రెస్ నేతలు ఒక వ్యూహం లేకుండా ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడి పలుచన కావటమే కాదు.. కాంగ్రెస్ ఎప్పటికి మారదన్న భావనను అత్యధికుల్లో కలిగించారన్న అభిప్రాయం ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ కాస్త ఆలస్యంగా గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ జరగకూడదన్నఆలోచనలో ఆ పార్టీ ఉందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ పార్టీ నేతలకు ఇచ్చిన వార్నింగ్ చూస్తే ఈ విషయం అర్థం కాక మానదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పార్టీ నేతలకు.. కార్యకర్తలకు ప్రియాంక సూటి వార్నింగ్ ఒకటి ఇచ్చేశారు. ఈ నెల 17న అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి సంబంధించి సుప్రీంకోర్టు తుదితీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఎవరూ తమకు తోచినట్లుగా వ్యాఖ్యానించకూడదన్న ఆదేశాల్ని జారీ చేశారు.

సుప్రీం తీర్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకునే వరకూ పార్టీ నేతలు ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని తేల్చేశారు. ఇందుకు సంబంధించి యూపీ నేతలకు ఆమె ఆదేశాల్ని జారీ చేశారు. ఆర్టికల్ 370 నిర్వీర్యం ఎపిసోడ్ లో జరిగిన తప్పులు.. అయోధ్య పై సుప్రీం ఇచ్చే తీర్పు సందర్భంగా చోటు చేసుకోకూడదన్న ఆలోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నట్లుగా చెప్పక తప్పదు.