Begin typing your search above and press return to search.

మళ్లీ ప్రియాంకను తెర మీదకు తీసుకొచ్చారు

By:  Tupaki Desk   |   4 July 2016 4:43 AM GMT
మళ్లీ ప్రియాంకను తెర మీదకు తీసుకొచ్చారు
X
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని యూపీ ఎన్నికల్లో బలమైన పక్షమన్న అభిప్రాయాన్ని అందరిలో కలిగించే దిశగా వేస్తున్న వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా తాజాగా మరోఅడుగు పడింది. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న ప్రముఖ పోల్ మేనేజ్ మెంట్ గురు ప్రశాంత్ కిశోర్ మరో వార్త మీడియాలో వచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

వారానికి.. పది రోజులకోసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్ తీసుకుంటున్న అతి పెద్ద రాజకీయ నిర్ణయం అన్న ఆసక్తిని రేకెత్తించేలా వార్తలు వచ్చేలా చేయటంలో ప్రశాంత్ కిశోర్ సక్సెస్ అవుతున్నారు. మొన్నామధ్యనే షీలాదీక్షిత్ ను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా వార్తలు వచ్చేలా చేసి.. ఆ తర్వాత ఆమె ఆసక్తి లేదన్నట్లుగా చెప్పించటంతో ఆ ఎపిసోడ్ ముగిసింది.తాజాగా తన తురుపుముక్క అయిన ప్రియాంకా గాంధీ పేరును తెర మీదకు తీసుకొచ్చారు. మొదట్లో ఆమెను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా వార్తలు వచ్చేలా చేసిన ఆయన తాజాగా అందుకు భిన్నంగా ఆమె.. యూపీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వచ్చేలా చేస్తున్నారు.

పార్టీని పునర్జీవనానికి ప్రియాంకకు మించినోళ్లు ఎవరూ లేరని.. అందుకే ఆమెను గాంధీ ఫ్యామిలీలకు కీలకమైన రాయబరేలీ.. అమేథి నియోజకవర్గాలతో పాటు మరో 150 అసెంబ్లీ స్థానాల్లో ప్రియాంక చేత ఎన్నికల ప్రచారం చేయిస్తే బాగుంటుందన్న అంచనాలు పార్టీలో వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ తరహా అంచనాలు వార్తలుగా మారే అంశంలో వెనుక ఎవరున్నది మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.