Begin typing your search above and press return to search.

తల్లి.. అన్న అడ్డాలకే ప్రియాంక పరిమితం

By:  Tupaki Desk   |   13 July 2016 10:18 AM IST
తల్లి.. అన్న అడ్డాలకే ప్రియాంక పరిమితం
X
మొన్నటి వరకూ ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ప్రియాంక గాంధీ దృష్టి పెట్టినట్లుగా.. జోరుగా ప్రచారం చేసేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా కొన్ని వార్తలు.. అలాంటిదేమీ లేదు.. ఏకంగా సీఎం అభ్యర్థి ఆమేనంటూ మరికొన్ని వార్తలు రావటం తెలిసిందే. అయితే.. అలాంటిదేమీ ఉండదని.. ఇదంతా ఉత్త హడావుడే అన్న మాటను పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలన్న ఆ మాటలే కరెక్ట్ అన్న విషయాన్ని తేలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ చేపట్టాల్సిన పాత్రపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

తాజాగా ఈ చర్చలకు పుల్ స్టాప్ పెడుతూ.. ప్రియాంకను.. తల్లి సోనియా.. సోదరుడు రాహుల్ నేతృత్వం వహిస్తున్న అమేధీ.. రాయబరేలి లోక్ సభా నియోజకవర్గాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మీద ఉన్న భూ ఆరోపణల నేపథ్యంలో ప్రియాంకను ఎక్కువ ఫోకస్ చేయటం మంచిది కాదన్న వాదనను పలువురు కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నాయి.

అయితే.. ఇది అసలు కారణం కాదని.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తన తురుపుముక్కలా ప్రియాంకా గాంధీని వాడాలన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆమెను రంగంలోకి దించితే లేనిపోని సమస్యలు వస్తాయన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. యూపీ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏమీ లేదన్న విషయం ఫలితాలు నిరూపిస్తే.. ప్రియాంక వస్తే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందంటూ ఆశ పెట్టుకున్న పార్టీ నేతలు నిరాశకు గురి అవుతారని.. అందుకే విలువైన అయుధంగా భావించే ప్రియాంకను అప్పుడే వినియోగించటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఇప్పటికైతే.. రెండు లోక్ సభ నియోజకవర్గాలకే ప్రియాంక పరిమితం అవుతారన్నది స్పష్టంగా చెప్పొచ్చు.