Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్టర్ వెనుకున్నదెవరు? బీజేపీకి ప్రియాంక సూటి ప్రశ్న?

By:  Tupaki Desk   |   10 July 2020 4:59 AM GMT
గ్యాంగ్ స్టర్ వెనుకున్నదెవరు? బీజేపీకి ప్రియాంక సూటి ప్రశ్న?
X
ఉత్తరప్రదేశ్ కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత అక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది. మాజీ సీఎం, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండటానికే వికాస్ దూబేను కృత్రిమంగా ఫేక్ ఎన్ కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. యోగీ సర్కార్ పల్టీ కొట్టకుండా ఉండడానికే వికాస్ కారును పల్టీ కొట్టించారని విమర్శించారు. వికాస్ దూబేను విచారించి ఉంటే యోగి ప్రభుత్వానికి నూకలు చెల్లేవని.. నేరస్థులు, గ్యాంగ్ స్టర్లతో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వానికి చీకటి ఒప్పందాలు ఉన్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అవన్నీ వెలుగులోకి రావద్దనే వికాస్ దూబేను ఎన్ కౌంటర్ చేశాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడు వికాస్ దూబేను ఎన్ కౌంటర్ లో చంపేశారు సరే.. మరి అతడి నేర సామ్రాజ్యం వెనుక ఉన్న వారి సంగతి ఏంటి అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

పిల్లలపై ,దళితులపై, మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్ నంబర్ 1 ఉందని.. మారణాయుధాలు, హత్యల్లో యూపీ నెంబర్ 1గా ఉందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితి పూర్తిగా చెత్తగా తయారైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వికాస్ దూబే వంటి నేరగాళ్ల సామ్రాజ్యం నడుస్తోందని ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేశారు.

వికాస్ దూబేకు రక్షణ కల్పించింది రాజకీయ నేతలేనని.. ఇతడి వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ట్విట్టర్ లో ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.