Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు క్రైసిస్ మేనేజర్ గా మారిన ప్రియాంక

By:  Tupaki Desk   |   1 July 2021 10:00 PM IST
కాంగ్రెస్ కు క్రైసిస్ మేనేజర్ గా మారిన ప్రియాంక
X
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మిగిలిన రంగాల కంటే రాజకీయాల్లో చాలా ముఖ్యం. ఈ విషయంలో జరుగుతున్న తప్పులే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను అంతకంతకూ మసకబారేలా చేస్తున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ సూట్ అవుతారన్న మెజార్టీ అభిప్రాయాన్నిప్రకటించటానికి ఎన్ని నెలలు తీసుకున్నారో తెలిసిందే. ఇప్పుడు చేసిన పనే ఏడాది క్రితం చేస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ తీరు మరోలా ఉండేదన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు.. ఇప్పుడున్న విభేదాలు సద్దుమణగటానికి కొంత సమయం పడుతుంది. ఏడాది క్రితమే ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే.. ఇప్పటికి అంతా సర్దుకొని ఉండేది.

దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పటికీ.. వాటిని సరి చేసుకునే విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందన్న విమర్శ ఉంది. తాజాగా అలాంటి తప్పుల్ని సరిదిద్దటానికి రాహుల్ సోదరి ప్రియాంక రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరే ఘటన తాజాగా చోటు చేసుకుంది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతగా ఫైర్ బ్రాండ్ సిద్ధూకు ఉందన్న విషయం తెలిసిందే.

తాజాగా అతడు రాహుల్.. ప్రియాంకలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అయితే... పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అపాయింట్ మెంట్ దొరికింది కానీ.. రాహుల్ మాత్రం నో చెప్పేశారు. ఇలాంటి వేళ.. సిద్ధూకు అనూహ్యంగా రాహుల్ నుంచి పిలుపు రావటం.. హుటాహుటిన కలిసేందుకు వెళ్లటం జరిగింది. అసలు జరిగే అవకాశం లేదన్న భేటీ కాస్తా జరగటం ఒక ఎత్తు అయితే.. దాదాపు అరగంట పాటు ఇద్దరు నేతల మధ్య మీటింగ్ జరగటం ఆసక్తికరంగా మారింది.

ఒకసారి నో అంటే నో అన్నట్లుగా ఉండే రాహుల్ మనసు మార్చిందెవరు? సిద్ధూతో భేటీకి రాహుల్ ను ఒప్పించిందెవరు? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రియాంక అన్న మాట వినిపిస్తోంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ప్రియాంక పార్టీకి క్రైసిస్ మేనేజర్ గా మారినట్లుగా భావిస్తున్నారు. సిద్ధూను కలిసే షెడ్యూల్ లేనప్పటికీ.. ప్రియాంక చొరవ తీసుకొని రాహుల్ తో మాట్లాడి ఒప్పించినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రియాంక క్రైసిస్ మేనేజర్ పాత్ర పోషిస్తే.. పార్టీకి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.