Begin typing your search above and press return to search.

'ఓటు' ను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్!

By:  Tupaki Desk   |   9 April 2019 11:30 AM IST
ఓటు ను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్!
X
సామాన్యుడి పరిస్థితి అంతే మరి. ఎవరైనా సామాన్యుడిని ఎడాపెడా వాడేసుకుంటున్నారు. సామాన్యుడి పరిస్థితిని ఎవరైనా క్యాష్ చేసుకోగలరు. సామాన్యుడు ఒక్కో రకంగా ఒక్కోరికి లోకువ. అందుకు ఒక ఉదాహరణ ఉపాధి కోసం నగరాలకు వెళ్లిన సామాన్యులంటే ట్రావెల్ బస్సుల వారికి లోకువ!

సామాన్యులకు అవసరాన్ని వారు ఎడా పెడా క్యాష్ చేసుకొంటూ ఉంటారు. పండగల సందర్భంల్లో అలాంటివి చూస్తూనే ఉంటాం. ఎన్నికల వేళ కూడా అందుకు మినహాయింపు కాదు. ఓటు వేయడానికి స్వస్థలాలకు వెళ్తున్న సామాన్యులను ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు ఎడాపెడా క్యాష్ చేసుకుంటున్నారు. టికెట్ రేట్లను అమాంతం పెంచేసి..వారు సామాన్యుల జేబులను ఖాళీ చేస్తూ ఉన్నారు.

ప్రత్యేకించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి స్వస్థలాలకు ఓటేయడానికి వెళ్తున్న వారి జేబులకు ప్రైవేట్ బస్సుల వాళ్లు చిల్లు పెడుతున్నారు. టికెట్ రేట్లను ఎడాపెడా పెంచేశారు ట్రావెల్ ఏజెంట్లు. మామూలుగా ఐదారు వందల రూపాయల ధరలో ఉండే టికెట్ ను వెయ్యి రూపాయల పై స్థాయికి తీసుకెళ్లారు. కొన్ని బస్సుల్లో అయితే పన్నెండు వందలు, పదిహేను వందల రూపాయలకు కూడా పెంచేశారు.

టికెట్ బుకింగ్స్ జరుగుతున్న కొద్దీ రేట్లను పెంచుతూ ఉన్నారు. డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రాన్ని వీరు ఉపయోగించుకుంటున్నారు. ఈ అంశం గురించి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఓటు వేయడం మీ బాధ్యత అని ఈసీ గట్టిగా చెబుతూ ఉంటుంది.

అలాంటి బాధ్యత కోసం వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే వాళ్లకు ఇలాంటి అసౌకర్యం కలుగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ప్రయాణికులను దోచేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈసీ జోక్యం చేసుకుని.. ఈ విషయం మీద దృష్టి సారించాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోజు రాత్రికి - రేపు భారీ ఎత్తున ప్రజలు ప్రయాణం కానున్నారు. ఇలాంటి సమయంలో ఈసీ జోక్యం చేసుకుని బస్ టికెట్లను న్యాయబద్ధంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది.