Begin typing your search above and press return to search.

దోపిడీ ప‌ర్వం.. వైర‌స్ చికిత్స‌కు ప్యాకేజీల పేరిట ప్రైవేటు ఆస్పత్రుల వ్యాపారం

By:  Tupaki Desk   |   23 July 2020 1:30 AM GMT
దోపిడీ ప‌ర్వం.. వైర‌స్ చికిత్స‌కు ప్యాకేజీల పేరిట ప్రైవేటు ఆస్పత్రుల వ్యాపారం
X
వేలాదిగా పెరుగుతున్న కేసులు.. అర‌కొర వైద్య సౌక‌ర్యాలు ఉండ‌డంతో మ‌హ‌మ్మారి వైర‌స్ విష‌యంలో టెస్టులు.. చికిత్స‌ల‌కు ప్రైవేటు ల్యాబ్‌లు.. ఆస్ప‌త్రుల‌కు అనుమ‌తులు ఇచ్చారు. సాధార‌ణంగా ప్రైవేటు ఆస్ప‌త్రులు ర‌క్తం పీలుస్తున్నారు. ఇప్పుడు ప్రాణాంత‌క వ్యాధి.. ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డిన స‌మ‌యంలో వారు రెచ్చిపోతున్నారు. అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని ఇష్టారీతిన బిల్లులు వేస్తూ దోపిడీ మొదలుపెట్టారు. ఇప్పుడు దీనికోసం ప్ర‌త్యేకంగా ప్యాకేజీల పేరిట ఆఫ‌ర్లు అంటూ వ్యాపారం మొద‌లుపెట్టారు. మాన‌వ‌త్వం మ‌ర‌చి ప్ర‌జ‌ల‌ను ఆ మ‌హ‌మ్మారి వైర‌స్ క‌న్నా తీవ్రంగా ప‌ట్టి పీడిస్తున్నారు. తెలంగాణలో కేసులు తీవ్రంగా పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్స్ ఖాళీ లేవు. దీంతో ప్రభుత్వం పాజిటివ్ వచ్చి తక్కువ లక్షణాలున్న బాధితులను హోం ఐసోలేషన్‌లో ఉండాల‌ని చెబుతోంది. ఇంటి వద్ద క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందాల‌ని చెప్పి పంపుతోంది. దీన్ని కూడా ప్రైవేటు ఆస్ప‌త్రులు వ‌ద‌ల‌డం లేదు. అలాంటి వారి కోసం ప్రైవేట్ ఆస్ప‌త్రులు ప్ర‌త్యేక ప్యాకేజీలతో పాటు సేవ‌లను కూడా ప్రకటిస్తున్నాయి. హోం క్వారంటైన్‌లో ఉంటున్నవారి కోసం కోవిడ్ 19 వర్చువల్ హోం కేర్ ఫెసిలిటీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రులు ప్ర‌త్యేక హోం క్వారంటైన్ కేర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. దీంతోపాటు ఇంటి వద్ద క్వారంటైన్ ఉండ‌లేని వారికి త‌మ ఆస్ప‌త్రుల్లో ప్రీమియమ్ హోటల్ క్వారంటైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నాలుగు నక్షత్రాల ప్రీమియమ్ హోటల్‌లో పూర్తిగా శానిటైజ్ చేయబడిన, వైద్యానికి అవసరమైన సదుపాయాలతో ఉన్న గదులను చికిత్సకు ఉపయోగించడానికి నిర్ణ‌యించాయి. దీనికోసం హోట‌ల్స్ వారితో ఒప్పందం చేసుకుని ఈ విధంగా ప్యాకేజీలు ప్ర‌క‌టిస్తున్నాయి. ఎందుకంటే వైర‌స్ వ్యాప్తితో ప‌ర్యాట‌క రంగం.. ఇత‌ర రంగాలు కుదేల‌వ‌డంతో ఎవ‌రూ హైద‌రాబాద్‌కు రావ‌డం లేదు. దీంతో హోట‌ల్స్ అన్నీ వెల‌వెల‌బోతున్నాయి. దీన్ని గ‌మ‌నించి ప్రైవేటు ఆస్ప‌త్రులు ఈ విధంగా ప్లాన్ చేశాయి. అలా హోట‌ల్స్‌లో ఏర్పాటుకు ఒక వ్యక్తి ఉండడానికి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండేలా (కుటుంబసభ్యులతో కలిసి) సింగల్, డబుల్ బెడ్ రూమ్‌లకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించనున్నాయి. ఈ సంద‌ర్భంగా డైటీషియన్ అధ్వర్యంలో స్పెషల్ ఫుడ్ సర్వీసు కూడా ఉంటుంది.

అయితే ఇందులో కూడా కొన్ని ర‌కాలు ఉన్నాయి. అది వైర‌స్ తీవ్రతను బట్టి ఒక్కో ప్యాకేజీ. వాటిలో బేసిక్, అడ్వాన్స్‌డ్‌, సూపర్ కేటగిరిలు ఉన్నాయి. వీటికి రూ.2 వేల నుంచి రూ. 20 వేల వరకు వ‌సూలు చేస్తున్నాయి. చికిత్స‌‌ను 5 రోజుల నుంచి 17 రోజుల వరకు అందిస్తున్నారు. ఈ క్రమంలో రోజూ వీడియో కాల్ ద్వారా వైద్యులు.. నర్సులు, డైటీషియన్స్ వైర‌స్ బాధితుడిని ప‌రిశీలిస్తుంటారు. మ‌రో స‌దుపాయం కూడా క‌ల్పిస్తున్నారు. స్పెషల్ కరోనా కిట్లను కూడా ఈ ఆస్ప‌త్రులు ఇస్తున్నాయి. వీటిలో ఆక్సిమీటర్, డిజిటల్ థర్మామీటర్, ఎన్ 95 మాస్కులు, గ్లవ్స్, విటమిన్ సీ, పారాసెట‌మల్ టాబ్లెట్స్ ఉంటాయి. దీంతోపాటు 24 గంటలు ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవ కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రైవేటు ఆస్ప‌త్రులు ప్ర‌త్యేక ప్యాకేజీల పేరిట వ్యాపారం మొద‌లుపెట్టాయి. వీటిని పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు భ‌రించ‌లేని స్థితిలో ఉన్నాయి. మాన‌వ‌త్వం మ‌ర‌చి ఆస్ప‌త్రి యాజ‌మాన్యాలు వ్యాపారానికి తెర‌తీయ‌డంతో పేద‌ల‌కు వైద్యం అంద‌ని ద్రాక్ష‌గా మారింది.