Begin typing your search above and press return to search.

జగన్ ఉండగా.. జూ.ఎన్టీఆర్ కు సినిమాలే బెస్ట్: ఫృథ్వీ

By:  Tupaki Desk   |   18 July 2020 8:50 AM GMT
జగన్ ఉండగా.. జూ.ఎన్టీఆర్ కు సినిమాలే బెస్ట్: ఫృథ్వీ
X
30ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాల్లో ఫేమస్ అయిన నటుడు, వైసీపీ నాయకుడు ఫృథ్వీ రాజ్ తాజాగా సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయలు వెలిబుచ్చారు. రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ, చంద్రబాబు పని అయిపోయిందని.. ఆయన తర్వాత రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఇప్పుడు అవసరం లేదని ఫృథ్వీ అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో అంతా బాగానే ఉన్నప్పుడు జూ.ఎన్టీఆర్ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.ఆయనకు సినిమాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని.. సినిమాలు చేయడం కొనసాగిస్తేనే మంచిదని సూచించారు.

చంద్రబాబు గురించి మాట్లాడడం వేస్ట్ అని.. అతడి పార్టీ కాదు.. గుర్తు ఆయనది కాదని.. ఆయన మామ నుంచి లాక్కున్నదని.. తన పార్టీ స్వాతంత్ర్యం కోసం పోరాడానని చెప్పుకున్న పెద్ద మనిషి అని సెటైర్లు వేశారు. లోకేష్ ఉత్తర కుమారుడు అని.. ఆయన ట్వీట్లను.. ఆయనను పట్టించుకునే వారు రాజకీయాల్లో లేరంటూ విమర్శించారు.

ఇక అవకాశం ఇస్తే తాను నర్సాపురం నుంచి వైసీపీ తరుఫున పోటీచేస్తానని.. రఘురామకృష్ణం రాజును ఓడిస్తానని ఫృథ్వీ చెప్పుకొచ్చాడు. రఘురామలా నేను పార్టీకి ద్రోహం చేయలేదని.. జగన్ పై, అధిష్టానంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. పార్టీకి విధేయుడిని అని చెప్పుకొచ్చారు. నాకు నర్సాపురం టికెట్ ఇవ్వమని జగన్ ను కోరుతున్నానని తెలిపారు. ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని వివరించారు.

ఇక ఎస్వీబీసీలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు అని.. ఇదంతా అబద్ధమని విజిలెన్స్ కమిటీ విచారణలో కూడా తేలిందని ఫృథ్వీ అన్నారు. నా ఫేవరెట్ గాడ్ వేంకటేశ్వరుడి సాక్షిగా తాను ఏ తప్పు చేయలేదని ఫృథ్వీ అన్నారు.

కరోనా సోకితే ఏం కాదని.. మీడియా, సోషల్ మీడియానే బెదిరిస్తోందని.. చైనాలో కంట్రోల్ చేసినట్టు దేశంలో మీడియాను కంట్రోల్ చేయాలని ఫృథ్వీ అన్నారు. ప్రజలను భయపెట్టకుండా వారికి అవగాహన కల్పించాలని ఫృథ్వీ అన్నారు. కరోనా రాకుండా మన సంప్రదాయబద్దమైన పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇక నటుడు పోసానితో తనకు విభేదాలు లేవని.. ఆయనక సొంత వ్యక్తిత్వం భావజాలం ఉందని.. దానికి నమస్తే చెప్పడం తప్పితే వ్యతిరేకంగా ఏమీ చెప్పలేను అని ఫృథ్వీ అన్నారు.