Begin typing your search above and press return to search.

నేనొక స్పేర్ పార్ట్.. ఆత్మకథలో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రిన్స్ హ్యారీ

By:  Tupaki Desk   |   12 Jan 2023 8:30 AM GMT
నేనొక స్పేర్ పార్ట్.. ఆత్మకథలో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రిన్స్ హ్యారీ
X
సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం మింగుడుపడని రాజరికం..ఎత్తైన భవనాల్లో ఎవరికి అందనంత దూరంగా ఉండటం తెలిసిందే. రాజరికంలో చోటు చేసుకునే ఎన్నో చీకటి కోణాలు ఒక పట్టాన బయటకు రావు. అలాంటిది అక్కడ జరిగే ఉదంతాల గురించి బయటకు చెప్పేందుకు ప్రిన్స్ హ్యారీ అస్సలు మొహమాటపడరు.

తన జీవితంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి పూస గుచ్చినట్లుగా ఆయన బయట పెడుతుంటారు. అస్సలు దాచుకోవాలన్న ఆలోచన లేకుండా తనకు ఎదురైన దారుణ అనుభవాల గురించి ఆయన తన ఆత్మకథలో వెల్లడించారు.

పెను సంచలనంగా మారిన ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ పుస్తకం బ్రిటన్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలు సంచలన అంశాల్ని బయటపెట్టారు. తన అన్న గురించి.. తన తండ్రి గురించి పలు వాస్తవాల్ని బయటపెట్టారు. తనను స్పేర్ గా భావించేవారన్నఆయన.. తాను పుట్టిన సమయంలో తన తండ్రి తన తల్లి డయానాతో అన్న మాటల్ని ఆయనీ పుస్తకంలో వెల్లడించారు.

తాను ఇరవైఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి తన గురించి.. తాను పుట్టిన వేళలో అన్న మాటల్ని తాను ఇంకొకరి నుంచి విన్నట్లుగా పేర్కొన్నారు. ''నాకు అప్పుడు ఇరవైఏళ్లు. అప్పట్లో నేను పుట్టినప్పుడు నా తండ్రి స్పందన గురించి చెప్పుకొచ్చారు. నా తల్లితో ఆయన అన్న మాటలివే.. అద్భుతం. నువ్వు నాకో వారుసుడు.. స్పేర్ ను ఇచ్చావు. నేను నా పనిని పూర్తి చేశానని వ్యాఖ్యానించారట'' అని పేర్కొన్నారు.

తన కంటే రెండేళ్లు పెద్దవాడైన ప్రిన్స్ విలియం సింహాసనానికి వారసుడని.. తాను స్పేర్ మాత్రమేనని పేర్కొన్నారు. ''నేను స్పేర్. నేను అతడి నీడను. ప్లాన్ ఏ పని చేయనప్పుడు నన్ను ప్లాన్ బిగా వాడతారు. విల్లీకి ఏదైనా జరగరానిది జరిగితే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు నన్నీ లోకంలోకి తీసుకొచ్చారు.

నా తండ్రి కింగ్ చార్లెస్ 3, నా సోదరుడు విలియం ఎప్పుడూ ఒకే విమానంలో ప్రయాణించరు. సింహాసనాన్ని అధిష్ఠించేందుకు వరుసలో ఉన్న వారికి ఎలాంటి అనూహ్య ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు ఉండేది. నా విషయంలో అలాంటి జాగ్రత్త ఉండదు. నన్నెప్పుడు స్పేర్ గానే భావించటం వల్ల పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు'' అంటూ తన ఆవేదనను బయటపెట్టాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.