Begin typing your search above and press return to search.

ఈనెల 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

By:  Tupaki Desk   |   25 July 2020 8:54 AM GMT
ఈనెల 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..
X
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా దాదాపుగా ఇదే రీతిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఈ నెల 27 న జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ కీలక భేటీలో దేశంలో కరోనా ఉధృతి పై , అలాగే ఆన్ లాక్ 3.0 పరిస్థితులపై లోతుగా చర్చించనున్నారు. కరోనా తీవ్రత, లాక్‌ డౌన్ మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తరువాత కూడా అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ నిర్వహించారు. తాజాగా జూన్ 16,17 తేదీల్లో వరుసగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కరోనాపై చర్చించారు. కరోనా తీవ్రత, కరోనా పై ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు గురించి అదేవిధంగా లాక్‌ డౌన్ సడలించిన తర్వాత పరిస్థితుల గురించి మోదీ తెలుసుకున్నారు. అంతే కాకుండా దేశంలో త్వరలోనే రోజు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నరు. ఈ నేపథ్యంలో ప్రధాని మరోసారి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎం లతో భేటీ ఏర్పాటు చేయబోతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇకపోతే , తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1336861కి పెరిగింది. అలాగే... గత 24 గంటల్లో 757 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 31358కి పెరిగింది.