Begin typing your search above and press return to search.

మోడీకి రెండు ఎదురుదెబ్బ‌లు.. ఖుష్ అవుతున్న కేసీఆర్ టీం

By:  Tupaki Desk   |   18 May 2022 8:00 AM IST
మోడీకి రెండు ఎదురుదెబ్బ‌లు.. ఖుష్ అవుతున్న కేసీఆర్ టీం
X
కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ స‌మ‌యం నుంచి మొదలుకొని కేంద్రంలోని బీజేపీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా విధాన‌ప‌ర‌మైన అంశాన‌లు సైతం ట‌చ్ చేస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల‌న లోప‌భూయిష్టం, అవినీతిమ‌యం అంటూ ఆరోపిస్తున్నారు. ఆయ‌న వాద‌నను అందిపుచ్చుకుంటూ టీఆర్ఎస్ పార్టీ నేత‌లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఇటీవ‌లి కాలంలో టీఆర్ఎస్ నాయ‌కుల వ‌రుస విమ‌ర్శ‌లు ఎదుర్కున్న ఓ నిర్ణ‌యం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. 'పవన్‌హన్స్‌' హెలికాఫ్టర్ల సంస్థను విక్రయించేందుకు కేంద్రం ఓకే చేయ‌గా...కొనుగోలు చేసే కంపెనీ ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు కోర్టు ఇచ్చిన ఆర్డర్లు బయటకు వచ్చాయి. దీంతో చేసేదేమీలేక, 'పవన్‌హన్స్‌' డిజిన్వెస్ట్‌మెంట్‌ నుంచి వెనక్కు తగ్గుతున్నట్టు బీజేపీ సర్కారు సోమవారం ప్రకటించింది. ఈ విష‌యంలో ముందు నుంచి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున మోడీ స‌ర్కారుకు త‌గిలిన ఎదురు దెబ్బ‌ను ప్ర‌చారం చేస్తోంది.

రూ. 4 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ప్ర‌భుత్వ రంగంలోని పవన్‌హన్స్‌లో 51 శాతం వాటాను కేవలం రూ.211.14 కోట్లకు స్టార్‌9 మొబిలిటీ కన్సార్షియానికి అమ్మే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ కొద్దిరోజుల క్రితమే ఆమోదముద్ర వేసింది. ఈ కన్సార్షియంలో అల్మాస్‌ గ్లోబల్‌ ఆపర్చునిటీ ఫండ్‌ కూడా ఉంనది. అయితే, ఆ కంపెనీపై ఓ పాత కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా బెంచ్‌ దివాలా కోడ్‌ సెక్షన్‌ 74 (3) కింద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న కోల్‌కతాకు చెందిన ఈఎంసీ లిమిటెడ్‌ కొనుగోలు బిడ్‌ను 2019లో అల్మాస్‌ గెలుచుకుంది.

దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా ఈఎంసీకి చెల్లించాల్సిన రూ.568 కోట్లను అల్మాస్‌ అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తుండటంతో రిజల్యూషన్‌ అధికారి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. దీంతో అల్మాస్‌ గ్లోబల్‌ వ్యవహారశైలిని ట్రిబ్యునల్‌ తప్పుబడుతూ, అల్మాస్‌ సమర్పించిన రూ.30 కోట్ల విలువగల రెండు బ్యాంక్‌ గ్యారంటీలను రద్దుచేసింది.

ఈ కంపెనీపై, దాని అధికారులపై ప్రొసీడింగ్‌ చర్యల్ని చేపడుతూ 2022 ఏప్రిల్‌ 22న ఎన్సీఎల్టీ కోల్‌కతా బెంచ్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్‌ 22న అల్మాస్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోల్‌కతా బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇది జరిగిన వారానికి అంటే ఏప్రిల్‌ 29న పవన్‌హన్స్‌ విక్రయ బిడ్‌ను క్యాబినెట్‌ ఆమోదించింది.

స‌హ‌జంగానే కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెళ్లువెత్తాయి. కొనుగోలు చేసే సంస్థపై ఆర్థిక నేరాల ఆరోపణలు ఉన్నప్పుడు కేంద్రం ఎలా బిడ్‌ను ఆమోదించిందని టీఆర్ఎస్ పార్టీ సైతం ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్రంపై విరుచుకుప‌డ్డారు.

కాగా ముప్పెట వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ హాన్స్ డిజిన్వెస్ట్‌మెంట్‌పై కేంద్రం వెన‌క్కు త‌గ్గింది. కాగా, గత నవంబర్‌లో సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (సెల్‌)ను కేంద్రం విక్రయానికి పెట్టింది. అయితే, సక్సెస్‌ఫుల్‌ బిడ్డర్‌గా ప్రకటించిన సంస్థపై ఆర్థిక నేరారోపణలు వచ్చాయి. దీంతో విక్రయాన్ని నిలిపేస్తున్నట్టు గత ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. ఈ రెండు అంశాల‌ను ఇప్పుడు టీఆర్ఎస్ వ‌ర్గాలు మోడీ స‌ర్కారుకు ఎదురుదెబ్బ అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారంలో పెడుతున్నాయి.