Begin typing your search above and press return to search.

ఈ తూరుపూ... ఆ యూరపూ ...మోడీ మ్యాజిక్...?

By:  Tupaki Desk   |   2 May 2022 6:00 AM IST
ఈ తూరుపూ... ఆ యూరపూ ...మోడీ మ్యాజిక్...?
X
మోడీ అంటేనే మ్యాజిక్. ఆయన ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. కరోనా రెండేళ్ళ కాలంలో ఆయన దేశం దాటింది పెద్దగా లేదు కానీ లేకపోతే ఆయన ఈ పాటికి మరిన్ని దేశాలు తిరిగేసి తన రికార్డుని తానే తిరగరాసేవారు. అయితేనేమి. ఇపుడు కొంప మునిగింది ఏమీ లేదు. అందుకే మోడీ ఏకబిగిన ఒక టైట్ షెడ్యూల్ తో ఫారిన్ ట్రిప్ కి బయల్దేరారు.

ఈసారి మోడీ విదేశీ యానం చాలా ఆసక్తిని రేపుతోంది. యూరప్ దేశాలను ఆయన వరసబెట్టి టచ్ చేసి వస్తున్న టూర్ ఇది. పైగా ఒక వైపు చూస్తే పశ్చిమ దేశాలు, యూరప్ దేశాలు ఒక్కటిగా ఉన్నాయి. అటు వైపు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న వేళ ఈ బంధం ఇంకా గట్టిగా బిగుసుకుంది.

ఈ టైమ్ లో భారత్ తటస్థ వైఖరినే అవలంబిస్తోంది. రష్యాతో తన చెలిమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే ఇతర దేశాలతో ఏ మాత్రం ఇబ్బంది లేని దౌత్య నీతిని ఫాలో అవుతోంది. అయితే ఇదంత సులువు కాదు. భారత్ మీద అమెరికా గుర్రుగా ఉంది. రష్యాతో భారత్ అన్ని రకాల బంధాలు తెంచుకోవాలని కోరుకుంటోంది.

కానీ భారత్ మాత్రం తన స్వతంత్ర విదేశీ విధానం నుంచి వెనక్కు మళ్ళడంలేదు. ఇంకో వైపు చూస్తే అమెరికా పైకి గట్టిగా ఏమీ అనలేని స్థితిలో ఉంది. ఇక యూరోపియన్ దేశాలకు కూడా భారత్ పోకడల మీద కొన్ని డౌట్లు ఉన్నాయి. వారికి రష్యా మీద ఆగ్రహం ఎంతో కొంత భారత్ మీద కూడా ప్రసరించేలా కధ సాగుతోంది.

దాంతో మోడీ మాస్టార్ సడెన్ గా యూరప్ టూర్ కి వెళ్ళారు. ఆయన ఏకంగా మూడు రోజుల పాటు దాదాపుగా పాతికకు మించిన భేటీలు కీలక సమావేశాలు జరపనున్నారు. యూరప్ దేశాధినేతలతో ఆయన ముఖా ముఖీ భేటీలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం అన్నది ప్రస్థావనకు వస్తుంది అంటున్నారు. అలాగే ఇంధన భద్రత అన్నది కీలక అంశంగా ఈ చర్చలు సాగుతాయని చెబుతున్నారు.

ఇక భారత్ విదేశాంగ విధానాన్ని మోడీ వారికి వివరించే ప్రయత్నం చేస్తారు అంటున్నారు. జర్ననీతో భేటీలను మొదలుపెట్టి డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ ఫిన్లాండ్ దేశాధినేతలను కలసి ప్రపంచ పరిస్థితులను చర్చిస్తారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మాట్లాడుతారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే మోడీ యూరప్ టూర్ ఆసక్తి రేపుతోంది.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ప్రపంచం అంతా భారత్ వైపు చూసిన సందర్భం ఉంది. ఇక భారత్ కూడా మిగిలిన వారిలా ఒకే వైపునకు వాలిపోకుండా బ్యాలన్స్డ్ గా వ్యవహరించింది. ఈ రోజు భారత్ కి ఇదే శ్రీరామ రక్ష కానుంది. యూరప్ దేశాలతో గుడ్ రిలేషన్స్ కంటిన్యూ చేస్తూనే ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపడం, ఇంధన భద్రత వంటి వాటి విషయంలో కలసి అడుగులు వేయడం వంటివి మోడీ టూర్ లో హైలెట్ అవుతాయని అంటున్నారు. మొత్తానికి మే 4న భారత్ కి మోడీ తిరిగి రానున్నారు.