Begin typing your search above and press return to search.

రాష్ట్రాలను కెలికి.. ర‌చ్చ‌యిపోయిన‌.. మోడీ.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   28 April 2022 9:00 AM IST
రాష్ట్రాలను కెలికి.. ర‌చ్చ‌యిపోయిన‌.. మోడీ.. రీజ‌న్ ఇదే!
X
కెలికి మ‌రీ కొట్టించుకోవ‌డం అంటే.. ఇదేనేమో! ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఇప్పుడు ఈ ప‌నే చేశారు. తాను స్వ‌యంగా కెలికి మ‌రీ.. రాష్ట్రాలతో చీవాట్లు తిన్నారు. అంతేకాదు.. నిల‌దీసే ప‌రిస్థితి తెచ్చుకున్నారు. దేశ రాజకీయాల్లో మరోసారి 'పెట్రో మంట' రాజుకుంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో.. విపక్షాలు విరుచుకుప డ్డాయి. పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదన్న మోడీకి భారీ కౌంటర్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటని కాంగ్రెస్ పార్టీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది.

మహారాష్ట్ర నుంచి కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందని, అయినా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే దుయ్యబట్టారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టింది. ``న‌వంబ‌రులో మీరు ప‌ది రూపాయలు త‌గ్గించాన‌ని చెబుతున్నారు. స‌రే. ఆ త‌ర్వాత మీరు 22 రూపాయ‌లు పెంచారు. ముందు దీని మాట చెప్పండి. ఇది త‌గ్గిస్తారా? లేదో తేల్చేయండి`` అని తృణ‌మూల్ ఎంపీ ఒక‌రు నిల‌దీశారు.

ఏం జ‌రిగిందంటే..

పెట్రోల్ ధరల పెరుగుదలపై మోడీ తొలిసారి స్పందించారు. కేంద్రం ఇంధన ధరలపై గత నవంబర్లో ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు పన్నులపై వెనక్కి తగ్గట్లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాని.. ఈ సందర్భంగా ఇంధన ధరల గురించి ప్రస్తావించారు. కరోనా పరిస్థితులపై సీఎంలతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

``దేశ ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం తగ్గించేందుకు కేంద్రం గత నవంబర్లో ఎక్సైజ్‌ పన్ను తగ్గించింది. సుంకాలను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు పన్ను తగ్గించాయి. మహారాష్ట్ర, బంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఏవో కారణాల వల్ల పన్ను తగ్గించలేదు. దీనివల్ల వారికి ఎంత ఆదాయం సమకూరిందనే విషయాల జోలికి వెళ్లను. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్‌లో తగ్గించాల్సిన పన్ను ఇప్పటికైనా తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి`` అని మోడీ వ్యాఖ్యానించారు.

అంతే! ఒక్క ఏపీ, తెలంగాణ త‌ప్ప‌.. మిగిలిన రాష్ట్రాలు మోడీపై నిప్పులు చెరిగాయి. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే కేంద్రం భారీగా పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీ సంగతేంటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మోడీ, కేంద్రాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎక్సైజ్ సుంకాలతోనే కేంద్రం.. రూ. 27 లక్షల కోట్లు వెనకేసుకుందని దుయ్యబట్టారు.

వ్యాట్ తగ్గించాలన్న మోడీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం రూ.26 వేల 500 కోట్లు బాకీ ఉందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదన్న ఠాక్రే.. మహారాష్ట్రపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ప్ర‌ధాని మౌనంగా చిరున‌వ్వు న‌వ్వి.. స‌మావేశాన్ని ముగించారు. ఇదంతా చూసిన వారు.. ఒక‌ట‌ని.. నాలుగు అనిపించుకోవ‌డం అంటే ఇదే మోడీజీ.. అంటున్నారు.