Begin typing your search above and press return to search.

గుహ‌లో ఒంట‌రిగా మోడీ ధ్యానం.. ఫోటోలెలా వ‌చ్చాయ్?

By:  Tupaki Desk   |   19 May 2019 5:08 AM GMT
గుహ‌లో ఒంట‌రిగా మోడీ ధ్యానం.. ఫోటోలెలా వ‌చ్చాయ్?
X
రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే మోడీ దేశ ప్ర‌జ‌ల్ని విప‌రీతంగా ఆక‌ర్షించారు. ప‌దేళ్ల పాటు చూసిన మౌన ప్ర‌ధానితో బోర్ కొట్టిన ప్ర‌జ‌ల‌కు.. మాట్లాడే ప్ర‌ధాని కావాల‌న్న కోరిక బ‌లీయంగా క‌లిగింది. దీనికి త‌గ్గ‌ట్లే త‌న మాట‌ల చాతుర్యంతో దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచేసిన మోడీ 2014 ఎన్నిక‌ల్లో ఎలాంటి విజ‌యం సాధించారో అంద‌రికి తెలిసిందే.

మౌన ప్ర‌ధానిని ప‌దేళ్లు భ‌రించిన దేశ ప్ర‌జ‌లు.. మాట్లాడే ప్ర‌ధానిని ఐదేళ్లు భ‌రించ‌లేని చిత్ర‌మైన ప‌రిస్థితి కనిపిస్తోందంటున్నారు. దీనికి పూర్తి బాధ్య‌త ప్ర‌ధాని మోడీదే. మొద‌ట్లో ఆయ‌న మాట‌లు.. చేత‌లు సిత్రంగా ఉండ‌ట‌మే కాదు.. గ‌తంలో ప్ర‌ధానులుగా ప‌ని చేసిన వారెవ‌రూ చేయ‌క‌పోవ‌టంతో ఇవ‌న్ని ఆస‌క్తిక‌ర అంశాలుగా మారాయి. కానీ.. మాట్లాడే ప్ర‌ధాని ప‌ని చేయ‌టం మీద కంటే కూడా ప్ర‌చారం మీద ఎక్కువ ఫోక‌స్ చేయ‌టం దేశ ప్ర‌జ‌ల్ని చిరాకు పెట్టిన‌ట్లుగా కనిపించ‌క మాన‌దు.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా ఒక‌ప్పుడు మోడీకి మొత్తంగా స్టాషాంగ న‌మ‌స్కారం చేసిన సోష‌ల్ మీడియా.. ఇప్పుడు రెండుగా చీలిపోవ‌ట‌మే కాదు.. మోడీ తీరును క‌డిగిపారేసే వారు ఎక్కువ అవుతున్నారు. మోడీకి ద‌న్నుగా నిలిచే వారు.. త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌ట‌మే త‌ప్పించి.. వారి అభిమానంలో లాజిక్ మిస్ అవుతున్న వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తున్న దుస్థితి.

తాజాగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన షో ఇప్పుడు ఎట‌కారంగా మారింది. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసి.. చివ‌రి ద‌శ పోలింగ్ కు ఒక రోజు ముందు హిమాల‌యాల్లోని ప‌ర్వ‌తాల్లో ఉన్న కేదార్ నాథ్ దేవాల‌యాన్ని సంద‌ర్శించిన ఆయ‌న‌.. గుడికి దాదాపుగా రెండు కిలోమీట‌ర్లు దూరంగా ఉండే గుహ‌లో ఏకాంతంగా ధ్యానం చేస్తున్న వైనానికి సంబంధించిన వార్త‌లు పెద్ద ఎత్తున రావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని స్థాయి నేత ఒంట‌రిగా ధ్యానం చేయ‌టం పూర్తిగా ప్రైవేటు వ్య‌వ‌హారం. కానీ.. త‌న తీరుతో చివ‌రి ద‌శ పోలింగ్ ను ప్ర‌భావితం చేయాలనుకున్నారో ఏమో కానీ.. మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం అయ్యేలా స‌మాచారం ఇచ్చిన తీరు.. త‌న వెంట మీడియాను తీసుకెళ్లే అవ‌కాశం ఇచ్చిన వైనం చూస్తే.. మోడీ మాష్టారి ఏకాంత ధ్యానం అస‌లు రూపంలో ఇట్టే తెలియ‌క మాన‌దు. ధ్యానంలో కూర్చున్న మోడీమాష్టారి ఫోటోలు పెద్ద ఎత్తున దిన‌ప‌త్రిక‌ల‌లో ప్ర‌చురితం అవుతున్న తీరు చూస్తే.. ఆయ‌నేం కోరుకున్నారో అది జ‌రుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కీల‌క‌మైన పోలింగ్ వేళ‌.. కాషాయ కండువాను క‌ప్పుకొని గంభీరంగా.. హిమాల‌య సానువుల్లోని ఒక గుహ‌లో ధ్యానంలో మునిగిపోవ‌టం చూస్తే మోడీ మాష్టారి మాస్ట‌ర్ మైండ్ కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.