Begin typing your search above and press return to search.

ఓడినందుకు దేశానికి సారీ చెప్పిన ఆమెను ట్వీట్ తో వెన్ను తట్టిన మోడీ

By:  Tupaki Desk   |   27 July 2021 6:33 AM GMT
ఓడినందుకు దేశానికి సారీ చెప్పిన ఆమెను ట్వీట్ తో వెన్ను తట్టిన మోడీ
X
రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ప్రధాని మోడీని రాజకీయ కోణంలో కాకుండా.. మిగిలిన విషయాల్లో ఆయన్ను అనుసరించే తీరు కొత్త పుంతలు తొక్కుతుంటుంది. ఇప్పటివరకు దేశ ప్రధానులు ఎవరూ వ్యవహరించిన రీతిలో ఆయన తీరు ఉంటుంది. భారత్ లాంటి దేశానికి ప్రధానిగా ఉండే వారు బోలెడన్ని పనులతో తీరిక లేకుండా ఉంటారు. అలాంటి వారు క్రీడలు అనే అంశం ఒకటి ఉందని.. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వారికి.. మీ వెనుక మేం ఉన్నామన్న ధీమాను.. భరోసాను కల్పించాల్సిన అవసరం అధికారంలో ఉన్న వారికి ఉండాలి.

బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటి పరిస్థితి మన దేశంలో పెద్దగా కనిపించదు. క్రికెట్ తప్పించి మరే ఇతర క్రీడల విషయాన్ని పెద్దగా పట్టించుకోని ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరించటం ప్రధాని మోడీకి చెల్లుతుంది. దేశానికో క్రీడా మంత్రి ఉన్నప్పటికి ఆయన చేయాల్సిన పనుల్ని ప్రధాని మోడీ చేయటం ఆయన గొప్పతనంగా చెప్పాలి. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో ఫెన్సింగ్ గేమ్ లో భారత్ పార్టిసిపేట్ చేసింది లేదు. అందుకు భిన్నంగా తొలిసారి ఫెన్సర్ భవానీ బరిలోకి దిగారు.

ఇప్పటికే ఆమెకు సంబంధించిన కథనాలు.. ఆమె పేదరికం.. ఆమెనుకష్టపడి పెంచిన తల్లిదండ్రులు.. వారి ఆశలకు ఏ మాత్రం లోటు లేకుండా పెరిగిన ఆమె.. ఏకంగా ఒలింపిక్స్ కు దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె అదరగొట్టాలని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్లే తొలి రౌండ్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా తొలిసారి ఒలింపిక్స్ లో మొదటి గేమ్ ను విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా భారతీయుల్ని ఆనందానికి గురి చేసింది భవానీ దేవి. రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో పోరాడి ఓటమి పాలైంది.

ఒలింపిక్స్ ఫెన్సింగ్ లో ఒక మ్యాచ్ గెలిచిన తొలి భారతీయురాలిగా గర్వపడుతున్నానని తెలిపిన ఆమె.. రెండో రౌండ్లో ఓడినందుకు మాత్రం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. తర్వాతి ఒలింపిక్స్ లో దేశ ప్రజల అంచనాలకు తగ్గట్లు ఆడి.. పతకాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చానని చెప్పింది. ఆమె పెట్టిన ట్వీట్ కు పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. ఆమె ట్వీట్ కు ప్రధాని మోడీ స్పందించారు.

‘మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తుంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పెట్టిన పోస్టు ఇప్పుడు స్ఫూర్తివంతంగానే కాదు.. ఓటమి వేదనలో ఉన్న వారికి ఊరట కలిగించేదిగా ఉందని చెప్పాలి. ఇలాంటి ట్వీట్లు క్రీడాకారులకే కాదు.. దేశీయంగా క్రీడలకు కొత్త ఉత్సాహానికి గురి చేస్తుందని చెప్పకతప్పదు. సమయానికి తగ్గట్లు ట్వీట్లు చేయటం.. దేశ ప్రజల మనసుల్ని దోచుకునే విషయంలో మోడీ తీరు మిగిలిన అధినేతలకు భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు.