Begin typing your search above and press return to search.

ఐక్యరాజ్యసమితి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ !

By:  Tupaki Desk   |   22 Sept 2020 1:40 PM IST
ఐక్యరాజ్యసమితి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ !
X
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన విభాగంగా కొనసాగుతున్న ఐక్యరాజ్యసమితి వ్యవహారశైలిపై ప్రధాని మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సిన సమయం వచ్చిందని , ఇప్పటికీ పాత పద్ధతులు, మూస ధోరణిలోనే కార్యకలాపాలను కొనసాగించడం వల్ల ప్రపంచదేశాలకు ఏ మాత్రం ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఇలాగే కొనసాగితే, ఐక్యరాజ్యసమితి క్రమంగా ప్రపంచ దేశాల విశ్వాసాన్ని కోల్పోతుందని కుండబద్దలు కొట్టినట్టు తేల్చిపడేశారు. కాలం చెల్లిన పద్ధతులు, విధానాలతో సవాళ్లను ఎదుర్కొనలేమని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సదస్సును ఉద్దేశించి మాట్లాడిన మోడీ ... ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ ప్రీ-రికార్డెడ్ వీడియోను ప్రదర్శించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆయన ప్రసంగం సాగింది. మానవత్వం, అన్ని దేశాలకు ప్రయోజనకారిగా ఉండేలా తనను తాను తీర్చుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, భద్రతా మండలినీ సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఐక్యరాజ్య సమితి ఇప్పుడు అనుసరిస్తోన్న వ్యూహాలు, విధానాలతో సరికొత్తగా పుట్టుకొస్తోన్న సవాళ్లను ఎదుర్కొనలేమని మోడీ స్పష్టం చేశారు. సంపూర్ణ, సమగ్ర సంస్కరణలను తక్షణమే చేపట్టకపోతే , ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిపై విశ్వాసాన్ని కోల్పోతాయని, ప్రతి సభ్య దేశానికీ మాట్లాడే హక్కును కల్పించాలని, వారి గళాన్ని వినాలని సూచించారు, మానవ సంక్షేమానికి అనుగుణంగా.. వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాల్సి ఉందని మోడీ చెప్పారు.

ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు కొనసాగుతోన్న పరిస్థితుల్లో 75 సంవత్సరాల కిందట ఓ ఆశాకిరణంలా ఐక్యరాజ్యసమితి ఏర్పాటైందని, ప్రపంచ దేశాలన్నింటి కోసం ఓ సంస్థ ఏర్పాటు కావడం చారిత్రక ఘట్టమని మోడీ చెప్పుకొచ్చారు. భారత్‌కు మాత్రమే సాధ్యమైన వసుధైవ కుటుంబకం అనే సూత్రంతో ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను జోడించిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి వల్లే ప్రపంచదేశాలు సురక్షితంగా ఉంటున్నాయనీ ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బలగాల్లో భారత్ వాటా అధికంగా ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటిదాకా 160 మంది భారత మిలటరీ, పోలీస్, సివిల్ పోలీసులు శాంతి పరిరక్షణలో వీరమరణం పొందారని చెప్పారు. దశలవారీగా రెండు లక్షల ట్రూప్‌లను భారత్.. ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి పంపించిందని అన్నారు