Begin typing your search above and press return to search.

మోడీపై పుస్తకం.. అమెజాన్ లో సంచలనం!

By:  Tupaki Desk   |   28 May 2021 11:00 PM IST
మోడీపై పుస్తకం.. అమెజాన్ లో సంచలనం!
X
భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అమ్మడానికి పెట్టిన ఓ పుస్తకం సంచలనం సృష్టిస్తోంది. పుస్తకాన్ని అమ్మకానికి పెట్టడం.. వెనువెంటనే తొలగించడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఏంటి ఆ పుస్తకం..? అందులో ఏముందనేది ఆసక్తిగా మారింది.

తాజాగా అమెజాన్ లో 'మాస్టర్ స్ట్రోక్: 420 సీక్రెట్స్ హెల్ప్ డ్ పీఎం ఇన్ ఇండియాస్ ఎంప్లారుమెంట్ గ్రోత్' పేరుతో అమెజాన్ లో పోస్టు అయిన ఈ పుస్తకాన్ని 'బేరోజ్ గార్ భక్త్' అనే రచయిత రాశాడు. ఇందులోని మొత్తం పేజీల సంఖ్య 56. ఈ-బుక్ ధర రూ.56గా పెట్టారు. పుస్తకం కింద డిస్క్రిప్షన్ లో రచయిత సమాచారం ఇచ్చారు. 'నిరుద్యోగం, కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంటే.. దేశాన్ని కాపాడిన మహానేత ప్రధాని మోడీ. దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ప్రధాని మోడీ ఏం చేశారన్నది ఈ పుస్తకంలో ఉంది' అని పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే సోషల్ మీడియాపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు కఠినం చేసింది. విదేశీ సంస్థలకు చుక్కలు చూపిస్తోంది. దేశంలోనూ మోడీ సర్కార్ పై సోషల్ మీడియాలో ట్సోల్స్, మీమ్స్, కరోనా వేళ ఏం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోడీపై పుస్తకం రాయడం.. వివాదాస్పద డిస్క్రిప్షన్ పెట్టడంతో అనవసరంగా వివాదం కొనితెచ్చుకోకూడదనే అమెజాన్ సంస్థ ఆ పుస్తకాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. మే 23న ఈ పుస్తకాన్ని అమెజాన్ లో పెట్టారు.

కానీ పుస్తకంలో ఖాళీ పేపర్లు పెట్టడంతో కొన్నవారు షాక్ కు గురయ్యారు. డిస్క్రిప్షన్ లో మోడీ గురించి అంత ఉపోద్ఘాతం చెప్పి లోపలికి వెళ్లి చూడగా ఖాళీ పేపర్లు దర్శన ఇవ్వడంతో పాఠకులు షాక్ అయ్యారు. అయితే ఈ కరోనా లాక్ డౌన్ వేళ మోడీ దేశానికి, ప్రజలకు ఏం చేయలేదనే సంకేతాలు ఇవ్వడానికే ఖాళీ పేపర్లు పెట్టినట్లుగా సమాచారం. ఇక ఇది పెద్ద దుమారం రేపడంతో కొందరు దృష్టికి తీసుకురావడంతో అమెజాన్ సంస్థ స్పందించి మే 25న తొలగించింది.