Begin typing your search above and press return to search.

మర్యాదలు చెప్పే కేసీఆర్.. ప్రధాని మోడీతో భేటీలో పాల్గొనలేదే?

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:09 AM GMT
మర్యాదలు చెప్పే కేసీఆర్.. ప్రధాని మోడీతో భేటీలో పాల్గొనలేదే?
X
కోపం కస్సున కొట్టుకొచ్చిన వేళలో హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేయటం.. తాను చెప్పాలనుకున్న మాటల్ని చెప్పేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. రాజకీయంగా ఎంత మాట అనేందుకైనా వెనుకాడని ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనపై ఎవరైనా ఘాటు విమర్శలు చేస్తే మాత్రం విరుచుకుపడతారు? ఇదేం పద్దతి.. ఆ మాత్రం గౌరవం కూడా ఉండదా? మర్యాద లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధిస్తారు.

ముఖ్యమంత్రిగా ఉన్న తాను రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నామని.. ప్రజలు ఎన్నుకున్నారని చెబుతూ.. తమ పార్టీకి వచ్చిన ఓట్లు.. సీట్ల లెక్కను గణాంకాలతో సహా వివరించటం తెలిసిందే. మరి.. ఇదే మర్యాద ముఖ్యమంత్రి కేసీఆర్ లో మిస్ అయితే ఎవరు ప్రశ్నించాలి? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని గౌరవించటం మన విధి అని మాటలు చెప్పే సీఎం కేసీఆర్.. తాను చెప్పే మాటలు తనకు కూడా వర్తిస్తాయన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో?

తాజాగా కొవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో భేటీ అయ్యారు ప్రధానమంత్రి మోడీ. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొడితే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. తెలంగాణను పట్టించుకోవాలని.. ప్రాధాన్యత ఇవ్వాలని..నిధులు కేటాయించాలని.. ప్రాజెక్టులను ప్రకటించాలంటూ తరచూ డిమాండ్లు చేసే కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ లు.. దేశ ప్రధానిగా ఉన్న మోడీ ఒక కీలక అంశం మీద భేటీ నిర్వహిస్తే.. దానికి హాజరుకాకపోవటం దేనికి నిదర్శనం?

రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. పాలనా పరంగా ప్రోటోకాల్ పాటించాలి కదా? ఒకవైపు తన రాజకీయం తాను చేస్తూ.. చేతల్లో చూపిస్తూ.. మిగిలిన వారు మాత్రం బుద్దిగా తాను కోరింది మాత్రమే చేయాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది కదా? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఉన్న తనకు మర్యాద.. గౌరవం ఇవ్వనోళ్లను బండ బూతులు తిట్టేసే సీఎం కేసీఆర్.. తాను సైతం ప్రజలు ఎదుర్కొన్న ప్రధాని మోడీని విమర్శిస్తానని.. తన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కాస్తంత ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే.

విమర్శలు చేయటం రాజకీయంలో భాగమని సర్ది చెప్పుకోవచ్చు. కానీ.. కీలక అంశాలకు సంబంధించిన సమీక్షా సమావేశానికి గైర్హాజరు కావటం విలువలు.. మర్యాదల గురించి మాట్లాడే కేసీఆర్ సబబేనా? అన్నది ప్రశ్న. జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలన్న తపనతో ఉన్న ఆయన.. ఆ ప్రయత్నం చేస్తూనే.. ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?