Begin typing your search above and press return to search.

ఇక మోడీ దిగి రావాల్సిందే.. ?

By:  Tupaki Desk   |   26 Nov 2021 2:30 PM GMT
ఇక  మోడీ దిగి రావాల్సిందే.. ?
X
మోడీ అంటే ఒకసారి తాను నిర్ణయం తీసుకుంటే తిరిగి దానిని సవరించుకోవడానికి అసలు తలొగ్గరు అని అంటారు. గత ఏడేళ్లలో దేశ ప్రజలకు అది అర్ధం అయిన విషయమే. అయితే మోడీని సైతం తలొగ్గ్గేలా చేసినది రైతుల పోరాటం. అవును ఏడాది పాటు అలుపెరగని తీరులో సాగిన రైతుల పోరాటం స్వాతంత్ర భారతాన మరో మహోద్య‌మంగా అంతా చెబుతారు.

ఇక గత కొన్ని దశాబ్దాలుగా పాలకులు తాము తలచిందే చేసుకుంటూ వెళ్తున్న వేళ ఒక్కసారి వారిని తిరిగి చూసేలా చేసి తమ తీరు మార్చుకునేలా చేసిన ఉద్యమంగా రైతుల పోరాటానికి ఇపుడు దేశాన ఎంతో గుర్తింపు లభిస్తోంది.

ఈ నేపధ్యంలో దేశంలో ఆసేతు హిమాచలం సాగుతున్న అనేక ఇతర ఉద్యమాలకు కూడా రైతులు సాధించిన విజయం స్పూర్తి దాయకం అయింది. దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఇపుడు జోరు చేస్తున్నారు.

పోరాడితే పోయేది ఏమీ లేదు ప్రైవేట్ సంకెళ్లు తప్ప మరేమీ కావని వారంతా భావిస్తున్నారు. దాంతో గేర్ మార్చి మరీ కొత్త పుంతలు తొక్కించడానికి, ఉద్యమానికి సరికొత్త ఊపిరులు అద్దడానికి వారు గట్టి ప్రయాత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ యాక్షన్ ప్లాన్ కి రెడీ చేసుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పది నెలలుగా పోరాడుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. అయితే ఇపుడు రైతులకు జై కొట్టిన మోడీ రేపటి రోజున జై విశాఖ స్టీల్ ప్లాంట్ అంటారని, అలా ఆయన చేత అనిపించాలని ఉక్కు ఉద్యమకారులు చూస్తున్నారు.

ఇక మీదట ఉక్కు ఉద్యమం కేవలం విశాఖ పొలిమేరలలోనే కాకుండా రాష్ట్రమంతటా విస్తరించాలని చూస్తున్నారు. అదే నేపధ్యంలో అన్ని వర్గాల ప్రజానీకాన్ని కలుపుకుని మరో దశ పోరాటానికి తెర తీయాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మాత్రమే కాదు, గర్వమని కూడా చాటి చెప్పాలనుకుంటున్నారు.

అదే విధంగా విశాఖ ఉక్కు పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి కూడా అఖిల పక్షంలో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. ఇక మీదట రాజ‌కీయ మద్దతును కూడా గట్టిగా కూడగట్టి కేంద్రానికి ఏపీ ఉక్కు సెగను తగిలేలా చేయాలని చూస్తున్నారు.

ఏపీలో ఒక్క బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నందువల్ల ఉక్కు పోరాటం మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు.

ఇక అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కి మరో మారు ఉక్కు కార్మిక సంఘాల నేతలు లేఖలు రాశారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం మీద వత్తిడి తీసుకురావాలని అందులో కోరారు. అలాగే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఇక స్టీల్ ప్లాంట్ కార్మికులు వంటా వార్పు పేరిట విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి జనాల నుంచి మద్దతు లభిస్తోంది.

దాంతో విశాఖ ఉక్కు పోరాటం వేడి ఏంటో ఢిల్లీకి తెలియచేయగలమన్న నమ్మకం కూడా వారిలో పెరిగింది. మొత్తానికి చూస్తే సాగు చట్టాల రద్దుతో విశాఖ ఉక్కు కార్మికులు జోరు పెంచుతున్నారు. దీంతో ఈ శీతాకాలం ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా వేసవి గాడ్పులు వీచడం ఖాయమని అంటున్నారు.