Begin typing your search above and press return to search.

మరో లాక్ డౌన్ అంటూ వైరల్ న్యూస్...కేంద్రం క్లారిటీ

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:03 PM GMT
మరో లాక్ డౌన్ అంటూ వైరల్ న్యూస్...కేంద్రం క్లారిటీ
X
తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ లో విధించిన లాక్ డౌన్ ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీంతో, జూన్ 8 నుంచి అన్ లాక్ డౌన్ ప్రారంభమైంది. అన్ లాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారంనాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్(2,86,756 కేసులు) ఐదో స్థానంలో ఉంది. అతి త్వరలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను భారత్ దాటేసే అవకాశం ఉంది. జూన్,జులైలో కేసుల తీవ్రత పీక్స్‌కు చేరుకుంటుందన్న నిపుణులు హెచ్చరికలకు తగ్గట్లుగానే కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగడంతో వైద్యులపై ఒత్తిడి కూడా పెరుగుతోందనడానికి మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఘటనలే నిదర్శనం. కేసుల పెరుగుదల నేపథ్యంలో తాజాగా జూన్ 15 నుంచి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పుకార్లపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ మెసేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ లో స్పష్టం చేసింది.

జూన్ 15 తర్వాత దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేందుకు కేంద్రం సిద్దమవుతోందని, దాని ప్రకారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంకేతాలు ఇచ్చిందని ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. మరోసారి రైళ్లు,విమాన సర్వీసులు పూర్తిగా రద్దు కానున్నాయని, లాక్ డౌన్ తప్పదని ప్రచారం జోరందుకుంది. దీంతో చాలామందిలో గందరగోళం మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. చెన్నైలో కరోనా కేసుల నియంత్రణకు నగరంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా అంటూ మద్రాస్ హైకోర్టు కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

చెన్నైతో పాటు,శివారు ప్రాంతాల్లో కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ వంటి చర్యలు ఏవైనా తీసుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇప్పటికైతే అలాంటి సూచనలేవి లేవని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆ మెసేజ్ వైరల్ అయింది. అయితే ఇది పూర్తిగా అవాస్తమని.. సంపూర్ణ లాక్ డౌన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ ఫేక్ మెసేజ్ ఓ హిందీ వార్తా చానెల్ నుంచి పుట్టుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.