Begin typing your search above and press return to search.

ఏపీలో రాష్ట్రపతి పాలనట

By:  Tupaki Desk   |   19 Sept 2021 2:04 PM IST
ఏపీలో రాష్ట్రపతి పాలనట
X
అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చాలా ఆశలే ఉన్నాయి. తొందరలోనే ఏపీలో ఆర్టికల్ 356 విధించే అవకాశం ఉందని కొత్త పల్లవి అందుకున్నారు. ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఎంత వీలైతే అంత తొందరగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తిరుగుబాటు ఎంపి కోరుకుంటున్నారు. ఆయనకు ఎందుకింత తొందర, కసి అంటే జగన్మోహన్ రెడ్డిపై పేరుకుపోయిన నిలువెత్తు వ్యతిరేకతే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కారణాలు ఏవైనా అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే జగన్-రఘురామ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి పెరిగిపోయి జగన్ను ధ్వేషించేస్ధాయికి చేరుకుంది. మొదట్లో ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించటం, విమర్శలు చేయటం వరకే పరిమితమైన ఎంపి మెల్లిగా వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. జగన్ ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రతి రోజు సీఎంను వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు మాట్లాడతున్నారు. ఈ నేపధ్యంలోనే ఎంపిపై సీఐడీ కేసు, కస్టడీ అన్నీ అందరికీ తెలిసిందే.

ఎలాగైనా సీఎంగా దింపేయాలన్న ఆలోచనతో జగన్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే ఎంపికి చంద్రబాబునాయుడు మద్దతు మీడియా విపరీతమైన హైప్ ఇస్తోంది. ఇదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలని కోర్టులో కేసువేశారు. ఆ కేసును సీబీఐ కోర్టు కొట్టేసింది. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఎంపి కొత్తగా ఆర్టికల్ 356 అంటూ గోల మొదలుపెట్టారు. శాంతిభద్రతలు అదుపు తప్పినపుడు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారు.

నిజానికి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఇంటిమీదకు వైసీపీ ఎంఎల్ఏ జోగిరమేష్+మద్దతుదారులు దాడికి ప్రయత్నంచినంత మాత్రాన శాంతిభద్రతలు అదుపులో లేవని చెప్పటం తప్పు. ఇలాంటి ఘటనలు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కూడా చాలానే జరిగాయి. కాబట్టి ఎంపి ఏమి మాట్లాడినా జగన్ వ్యతిరేక మీడియా తప్ప ఇంకెవరు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే రఘురామ ఒక కామెడీ పీస్ అయిపోయారు.

జగన్ను వ్యతిరేకించినపుడు ఎంపి పదవికి, పార్టీకి రాజీనామా చేసుంటే రఘురామకు కాస్త మర్యాద ఉండేది. అలాకాకుండా ఎంపి పదవికి రాజీనామా చేసేది లేదని, పార్టీ నుండి బయటకు వచ్చేది లేదని చెప్పటంతోనే జనాల్లో పలుచనైపోయారు. ఎంపికి రాజీనామ చేయకుండా పార్టీలోనే ఉంటు జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతానంటే ఎవరు హర్షించరు. ఎంపి పదవికి రాజీనామా చేస్తే తన భవిష్యత్తు ఏమిటో రఘురామకు బాగా తెలుసు. అందుకనే మీడియా ముందుకూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.