Begin typing your search above and press return to search.

ట్రంప్ సంచ‌ల‌నం: మ‌ళ్లీ ఎమ‌ర్జెన్సీ

By:  Tupaki Desk   |   16 Feb 2019 7:16 AM GMT
ట్రంప్ సంచ‌ల‌నం: మ‌ళ్లీ ఎమ‌ర్జెన్సీ
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అక్రమ వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దు వెంబడి గోడను నిర్మిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు.. నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే ప్రతిపక్షాలతో పోరాడుతున్న ట్రంప్.. తాజా ప్రకటనతో కొత్త ఘర్షణకు తెర లేపారు. ప్రతిపాదిత గోడ నిర్మాణానికి పార్లమెంట్ గతంలో ట్రంప్ కోరిన దానికంటే చాలా తక్కువ మొత్తాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ తో నిమిత్తం లేకుండా గోడ నిర్మాణానికి కేంద్ర సైనిక బలగాల నిధుల నుంచి వందల కోట్ల డాలర్లను మళ్లించేందుకు ఎగ్జిక్యూటివ్ అధికారాలను ఉపయోగిస్తానని ట్రంప్ స్పష్టం చేసినట్టు సమాచారం.

శుక్రవారం అధికారికంగా ప్రకటన వెలువడిన వెంటనే కొందరు భూస్వాములు ట్రంప్‌ చర్యను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆస్తిహక్కులకు ట్రంప్‌ చర్య భంగం కల్గిస్తోందని వీరు ఆరోపిస్తున్నారు. ట్రంప్‌ చర్యను సవాలు చేయాలని న్యూయార్క్‌ - కాలిఫోర్నియా రాష్ట్రాలు నిర్ణయించినట్లు రాయిటర్స్‌ వార్త సంస్థ పేర్కొంది. గోడ నిర్మాణం కోసం 1.4 బిలియన్‌ డాలర్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించింది. ఇవి ఏమాత్రం సరిపోవని - తాను కోరుకుంటున్నట్లు గోడ నిర్మాణానికి సుమారు ఎనిమిది బిలియన్‌ డాలర్లు అవసరమని ట్రంప్‌ వాదిస్తున్నారు. దీంతో ఎమర్జెన్సీ విధించి...నిధులను వినియోగించాలని నిర్ణయించారు. అయితే ట్రంప్‌ ఆకస్మికంగా తీసుకున్న చర్యపై చర్యలకు విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ నేతలు నిర్ణయించారు. తమ ఆధీనంలోని ప్రజా ప్రతినిధుల సభ ద్వారా విచారణకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు. ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు అనుగుణంగా తీసుకున్న చర్యల పత్రాలను తమకు సమర్పించాలని ప్రజాప్రతినిధుల సభ ట్రంప్‌ ను కోరనుంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న న్యాయ విభాగ అధికారుల జాబితా కూడా కోరనుంది. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా చట్టసభలను కాదని ఎమర్జెన్సి విధించి... నిధులు విడుదల చేయడం సరికాదని డెమొక్రటిక్‌ పార్టీ భావిస్తోంది.