Begin typing your search above and press return to search.

తానే పవర్ ఫుల్ అని చెప్పేసిన పెద్దన్న

By:  Tupaki Desk   |   13 Jan 2016 12:10 PM IST
తానే పవర్ ఫుల్ అని చెప్పేసిన పెద్దన్న
X
ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు మరోసారి తానేంటో ప్రపంచానికి చాటి చెప్పారు. కాకపోతే చేతల్లో కాకుండా మాటల్లో తాము అత్యంత శక్తివంతమైన దేశంగా ఆయనకు ఆయన అభివర్ణించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి రెండో దఫా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఒబామా.. తన పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆఖరిసారి ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

తుపాకీ హింస మీద కొద్దిరోజులుగా గళం విప్పుతున్న ఒబామా.. తాజా ప్రసంగంలోని ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో పెరిగిపోతున్న తుపాకీ హింస నుంచి మన పిల్లల్ని రక్షించుకోవాలన్న సందేశాన్ని ఇచ్చిన ఆయన.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మీద సాగిస్తున్న పోరాటం మూడో ప్రపంచ యుద్దం కానేకాదని స్పష్టం చేశారు.

భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన పడొద్దని చెప్పిన ఒబామా.. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా రానున్న పదేళ్లలో అమెరికన్ల భవిష్యత్తు మీద దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ముస్లింలను విమర్శించటం వల్ల.. మసీదులు ధ్వంసం చేయటం వల్ల సురక్షితంగా ఉండలేమన్న ఒబామా.. అమెరికా చిత్తశుద్ధి మీద కానీ.. తనపై సందేహాం కానీ ఉంటే.. న్యాయం జరిగిందా? లేదా? అన్నది బిన్ లాడెన్ ను అడగాలంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.