Begin typing your search above and press return to search.

రేషన్‌ సరకులు డోర్ డెలివరీ రంగం సిద్ధం .. ఆ వ్యాన్లు వచ్చేశాయ్ !

By:  Tupaki Desk   |   2 Dec 2020 12:00 PM GMT
రేషన్‌ సరకులు డోర్ డెలివరీ రంగం సిద్ధం .. ఆ వ్యాన్లు వచ్చేశాయ్ !
X
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం .. వాలంటీర్ వ్యవస్థ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సచ్చివాలయం ఏర్పాటు చేసి , ఏ అవసరం వచ్చినా కూడా అక్కడే పని పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసారు. ఇక వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి అన్ని పనులని పూర్తి చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో రేషన్ సరుకులు కూడా డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. తాజాగా రేషన్‌ సరకులు డోర్‌ డెలివరీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం రేషన్‌ సరకులను మినీ వ్యాన్‌ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది.

సరుకులు తరలించడానికి అవసరమైన మినీ వ్యాన్లు సిద్ధం చేస్తోంది. ఆ మినీ వ్యాన్లు తోలేందుకు డ్రైవర్లను కూడా త్వరలో నియామకం చేపట్టనుంది. తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్‌ నుంచి గూడ్స్‌ రైలు ద్వారా మంగళవారం న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌ కు చేరుకున్నాయి. కాగా, జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకవసరమైన మినీ ట్రక్కులను అన్ని వర్గాల యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించనుంది. ఈ ట్రక్కులను రాయితీపై అందజేయనుంది. జిల్లాలో 817 మినీ ట్రక్కులు అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. దీనికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మినీ ట్రక్కుల కోసం అనూహ్య స్పందన లభించింది. ఈ 817 మినీ ట్రక్కులకు 8,179 మంది దరఖాస్తు చేశారు.