Begin typing your search above and press return to search.

చంబల్‌ లో బందిపోట్లను గడగడలాడించిన శివంగి !

By:  Tupaki Desk   |   5 Oct 2021 1:01 PM IST
చంబల్‌ లో బందిపోట్లను గడగడలాడించిన శివంగి !
X
చంబల్‌ లోయ అంటే ఎంతో పేరుపొందిన పోలీస్‌ ఆఫీసర్లు కూడా పోస్టింగ్‌ వద్దు అని వెనక్కి తగ్గుతారు. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్‌ తీసుకుంది. సరిగ్గా మూడు నెలలు. బందిపోట్లు గడగడలాడారు. దీని వెనుక పెద్దవాళ్లున్నారు అని కొన్ని కేసుల జోలికి రారు ఆఫీసర్లు. కానీ, ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది. కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్‌ లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. అది 2020, మే నెల. లాక్‌డౌన్‌ నడుస్తోంది. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ వెస్ట్‌ కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్‌లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కారు ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను కల్యాణ్‌పూర్‌ నుంచి జోద్‌పూర్‌కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరముంది.

ప్రీతి చంద్ర వెంటనే రంగంలో దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్‌ సీట్‌ లోకి మార్పించింది. దగ్గర్లోనే ఉన్న టెంట్‌ హాల్‌ ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది. ఒక టీమ్‌ ను డాక్టర్‌ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టరు వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లీబిడ్డా క్షేమం. కాని ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది ప్రీతి అని.

2019లో ప్రీతి చంద్రాను కరోలి జిల్లాకు ఎస్పీ గా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్‌ లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్‌.పి కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే. కాని ప్రీతి చంద్ర చార్జ్‌ తీసుకున్న మూడు నెలల్లోనే చంబల్‌ ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్‌ లో క్యాంప్‌ చేసింది. సరిగ్గా మూడు నెలల్లో పదిమంది పేరుమోసిన బందిపోట్లను అరెస్ట్‌ చేసింది. వారికి ఇన్‌ ఫార్మర్లుగా పని చేసేవారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరార్‌ అయ్యారు.

కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ ‘లేడీ సింగం’ అని పిలవసాగారు. ప్రీతి చంద్ర రాజస్థాన్‌ లో 2008 ఐ.పి.ఎస్‌ బ్యాచ్‌ ఆఫీసర్‌. ఆమెది సీకర్‌ జిల్లాలోని కుందన్‌ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్‌.ఎఫ్‌ లో పని చేసేవాడు. తల్లి నిరక్షరాస్యురాలు. మా అమ్మ జీవితంలో పెన్సిల్‌ కూడా పట్టుకుని ఎరగదు. కాని నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టు బట్టింది. నేను ఐ.పి.ఎస్‌ అవడానికి ఆమే కారణం అంటుంది ప్రీతి. జైపూర్‌ లో ఎం.ఏ, ఎం.ఫిల్‌ చేసిన ప్రీతి కొన్నాళ్లు స్కూల్‌ లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్లు జర్నలిస్ట్‌ గా పని చేసింది. నిజానికి జర్నలిస్టుగానే ఎదగాలని అనుకుందిగాని యు.పి.ఎస్‌.సి రాసి ఫస్ట్‌ అటెంప్ట్‌ లోనే ఐ.పి.ఎస్‌ అయ్యింది.