Begin typing your search above and press return to search.

తాజా స‌ర్వే: క‌న్న‌డ నాట‌ హంగే!

By:  Tupaki Desk   |   10 May 2018 4:49 AM GMT
తాజా స‌ర్వే:  క‌న్న‌డ నాట‌ హంగే!
X
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న అంశంపై మ‌రో స‌ర్వే ఫ‌లితం వెలువ‌డింది. ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్‌కు స‌రిగ్గా మూడు రోజుల ముందు విడుద‌ల చేసిన స‌ర్వేలోనూ తుది ఫ‌లితం హంగేన‌ని తేల్చింది. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి వెలువ‌డిన అన్ని స‌ర్వేలు..ఈసారి హంగు త‌ప్ప‌ద‌ని.. ప్ర‌భుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీల‌క‌భూమిక పోషిస్తుంద‌న్న మాటే వినిపించింది.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఇండియా టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన స‌ర్వేలోనూ హంగ్ త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాజాగా తాము విడుద‌ల చేసిన స‌ర్వేను మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌టానికి ముందు చేపట్టిన‌ట్లు పేర్కొంది. మొదట్నించి బీజేపీ నేత‌ల మాటేమిటంటే.. మోడీ ఎంట్రీ ఇచ్చాక ఓట‌ర్ మైండ్ సెట్ మారిపోతుంద‌ని.. ఆయ‌న ప్ర‌చారం తుది ఫ‌లితం మీద త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న మాట‌ను బ‌లంగా చెబుతున్నారు.

మోడీ ప్ర‌చారం మొద‌లెట్టిన త‌ర్వాత ఆ పార్టీకి కొంత సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన‌ట్లుగా వాద‌న ఉంది. ఇదే విష‌యాన్ని ఇండియా టీవీ వెల్ల‌డించింది కూడా. అయితే.. తాము చేసిన స‌ర్వే.. మోడీ ప్ర‌చారం స్టార్ట్ చేయ‌క‌ముందు అని పేర్కొంది. దీంతో.. తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న సందేహాలు ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన స‌ర్వే ఫ‌లితాల మాదిరే ఇండియా టీవీ ఫ‌లితం కూడా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికారిక కాంగ్రెస్ పార్టీ 96 స్థానాల‌తో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని చెప్పిన ఇండియా టీవీ ఛాన‌ల్‌.. 85 స్థానాల‌తో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుంద‌ని చెప్పింది. ఇక‌.. జేడీఎస్ కు 38 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని స‌ర్వే పేర్కొంది.

ఇండియా టీవీ స‌ర్వే ప్రకారం బాంబే క‌ర్ణాట‌క‌లో బీజేపీకి 23.. కాంగ్రెస్ కు 21.. జేడీఎస్ 4 స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని.. కోస్తా క‌ర్ణాట‌క‌లో బీజేపీ 9.. కాంగ్రెస్ 10.. జేడీఎస్ 2 చోట్లు గెలుస్తుంద‌ని.. గ్రేట‌ర్ బెంగ‌ళూరులో బీజేపీ 13.. కాంగ్రెస్ 18.. జేడీఎస్ 1 స్థానంలో విజ‌యం సాధించే వీలుంద‌ని చెప్పింది.

మధ్య కర్ణాటకలో బీజేపీ 20.. కాంగ్రెస్ 13.. జేడీఎస్‌ 2 చోట్ల విజయం సాధించే వీలుంద‌ని.. హైదరాబాద్‌ కర్ణాటకలో బీజేపీ 15 .. కాంగ్రెస్ 14.. జేడీఎస్‌ 2 చోట్ల గెలిచే అవకాశం ఉంద‌ని చెప్పింది. ఇక‌.. మైసూరు ప్రాంతంలో జేడీఎస్ 24.. కాంగ్రెస్‌2.. చోట్ల గెలిచే అవ‌కాశం ఉంద‌ని.. ఇక్క‌డ బీజేపీకి మాత్రం 8 సీట్లు మాత్రమే దక్కుతాయని చెప్పింది. తుది ఫ‌లితం మీద‌ ఈ ప్రాంత ఫ‌లిత‌మే కీల‌క‌భూమిక పోషిస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప్రాంతంలో ఫ‌లిత‌మే క‌ర్ణాట‌క‌లో హంగ్ కు కార‌ణం అవుతుంద‌ని.. మిగిలిన ప్రాంతాల్లో మాదిరే.. మైసూర్ ప్రాంతంలోనూ కాంగ్రెస్ అధిక్య‌త చూపిస్తే తుది ఫ‌లితం మీద ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.