Begin typing your search above and press return to search.

స‌ర్వే మాట‌!... గెలుపు జ‌గ‌న్‌ దేన‌ట‌!

By:  Tupaki Desk   |   19 Aug 2017 12:55 PM GMT
స‌ర్వే మాట‌!... గెలుపు జ‌గ‌న్‌ దేన‌ట‌!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక రోజురోజుకూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎంత‌గానంటే... అక్క‌డ జ‌రిగే ఏ ఒక్క చిన్న సంఘ‌ట‌న‌ను కూడా మీడియా వ‌ద‌ల‌డం లేదు. చిన్న వార్త అయినా కూడా ఇప్పుడు నంద్యాల‌లో జ‌రిగే ప్ర‌తి విషయం కూడా ప‌తాక శీర్షిక‌ల‌నెక్కేస్తోంది. 2019లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నంద్యాల బైపోల్స్‌ ను అటు అధికార టీడీపీ - ఇటు విప‌క్ష వైసీపీ సెమీ ఫైన‌ల్స్‌ గా ప‌రిగ‌ణిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అన్న కోణంలో ఇరు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు అక్క‌డ ఏం జ‌రిగినా కూడా ఆస‌క్తిక‌రంగానే మారిపోయింది. అయినా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం ఏ పార్టీని వ‌రిస్తుంద‌న్న అంశంపై ఇప్ప‌టికే చాలా స‌ర్వేలే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొన్ని స‌ర్వేలు టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిదే విజ‌యం అని చెప్ప‌గా, మ‌రికొన్ని స‌ర్వేలు వైసీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి దేన‌ని చెప్పేశాయి. అంటే ఈ రోజున్న ప‌రిస్థితి రేపు ఉండ‌ద‌న్న‌ట్లుగా అక్క‌డి ప‌రిస్థితి త‌యారైంద‌ని జ‌నం భావిస్తున్నారు.

అయినా ఇప్ప‌టిదాకా వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ కూడా న‌వ్యాంధ్ర‌కు - తెలుగు నేల‌కు చెందిన సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలే కాగా.. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఓ జాతీయ మీడియా సంస్థ స‌ర్వే ఇప్పుడు టీడీపీని కంగారెత్తిస్తోంది. అదే స‌మ‌యంలో విప‌క్ష వైసీపీలో మ‌రింత‌గా జోష్ పెంచేసింది. ఎందుకంటే... ఇప్ప‌టిదాకా వ‌చ్చిన స‌ర్వేల‌పై ఆయా పార్టీల ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంటుంది కాబ‌ట్టి... వారికి అనుకూల‌మైన పార్టీ - వ్య‌క్తిదే విజ‌యమ‌ని చెప్పేశాయ‌ని, ఇప్పుడు వ‌చ్చిన జాతీయ మీడియా స‌ర్వే మాత్రం ఏ ఒక్క పార్టీ వైపు మొగ్గ‌కుండా ఫీల్డ్ లెవెల్ కు వెళ్లి మ‌రీ త‌న ఫ‌లితాన్ని చెప్పింద‌ట‌. ఈ స‌ర్వే ప్ర‌తిని స‌ద‌రు సంస్థ నేరుగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు చూపింద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. స‌ద‌రు స‌ర్వేలోని అంశాల‌ను చూసిన చంద్ర‌బాబు... తమ అభ్య‌ర్థి అప‌జ‌యాన్ని సొంత పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన తీరే కార‌ణ‌మ‌న్న విష‌యాన్ని తెలుసుకుని ఎలా స్పందించాలో కూడా అర్థం కాని స్థితిలో ప‌డిపోయార‌ట‌.

ఇక‌ ఈ స‌ర్వే ప్ర‌కారం ఎన్నిక‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఓడిపోవ‌డం ఖాయ‌మేన‌ట‌. అదే స‌మ‌యంలో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన శిల్పా మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించ‌డం కూడా ఖాయ‌మేన‌ట‌. అయినా ఆ స‌ర్వే ఫ‌లితం నిక్క‌చ్చిత‌నం ఎంత‌మేర అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌డం మామూలే క‌దా. అయితే స‌ద‌రు సంస్థ త‌న స‌ర్వే ఫ‌లితాన్ని చెప్ప‌డంతో పాటు జ‌నం మొగ్గును ఏఏ కార‌ణాలు ప్ర‌భావితం చేశాయ‌న్న విష‌యాల‌ను కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చెప్పింద‌ట‌. ఈ కార‌ణాలు విన్న త‌ర్వాత ఆ స‌ర్వే ఫ‌లితం నిజం కాబోతోంద‌ని న‌మ్మ‌క త‌ప్ప‌దంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇక టీడీపీ ప‌త‌నానికి ప్రధాన కార‌ణాలు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... మొన్న‌టిదాకా నంద్యాల జ‌నం టీడీపీ వైపే ఉన్నార‌ట‌. అయితే అక్క‌డే తిష్ట వేసిన ఇత‌ర జిల్లాల‌కు చెందిన పార్టీ నేత‌లు - మంత్రులు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌ని ఆ స‌ర్వే చెప్పింది. అంతేకాకుండా... ఓట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ టీడీపీ నేత‌లు చేసిన‌, చేస్తున్న ప్ర‌చారం కూడా ఆ పార్టీ అభ్య‌ర్థికి చేటు తెచ్చాయ‌ట‌. ఇక మూడో కార‌ణంగా నంద్యాల టీడీపీ నేత‌లు ఒక్క‌తాటిపై లేక‌పోవ‌డంతో టీడీపీకి పెద్ద దెబ్బే త‌గ‌ల‌నుంద‌ట‌. మొన్న‌టిదాకా టీడీపీ వైపే మొగ్గిన జ‌నం ఈ కార‌ణాల వ‌ల్ల త‌మ రూటు మార్చేశార‌ని ఆ స‌ర్వే తేల్చిచెప్పింది.

ఇక టీడీపీ నేత‌లు జ‌నానికి ఇష్ట‌మైన రీతిలో ప్ర‌చారం చేయ‌లేక‌పోయార‌నుకోండి... మ‌రి వారంతా వైసీపీ వైపు ఎందుకు మళ్లారన్న విష‌యానికి వ‌స్తే... ఓ పార్టీకి అధ్య‌క్షుడిగా ఉండి కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గ‌డచిన ప‌ది రోజులుగా నంద్యాల‌లోనే మకాం పెట్టారు. రోజూ నాన్ స్టాప్‌ గా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్‌... ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపు అన్ని గ్రామాలతో పాటు ప్ర‌తి ఓట‌రు ఇంటి త‌లుపునూ త‌ట్టిన‌ట్లుగా ఆ స‌ర్వే చెబుతోంది. ఈ క్ర‌మంలో తాను చెప్ప‌ద‌ల‌చుకున్న మాట‌ను జ‌గ‌న్... నంద్యాల ఓట‌ర్లు మొత్తం అంద‌రికీ స్వ‌యంగా వినిపించిన‌ట్టేన‌ని కూడా ఆ స‌ర్వే తేల్చేసింది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఎలాంటి పాల‌న సాగిస్తుందో, ఉప ఎన్నిక‌ల ముందే అభివృద్ది నిధుల పేరిట కోట్లాది నిధుల‌ను ఎందుకు విడుద‌ల చేసిందో, చేతిలో ఉన్న అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందోన‌న్న విష‌యాల‌తో పాటు నీతివంత‌మైన రాజ‌కీయాల‌కు తాము పెట్టింది పేరుగా నిల‌బ‌డితే... త‌న పార్టీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకున్న వైనాన్ని జ‌గ‌న్‌... ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థ‌మ‌య్యేలా వివ‌రించార‌ట‌. ఓ వైపు తెలుగు త‌మ్ముళ్ల వ‌రుస త‌ప్పిదాలు... అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఇప్పుడు నంద్యాల జ‌నం వైసీపీకే ఓటు వేసేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌. అంటే నంద్యాల ఉప ఎన్నిక‌లో శిల్పా మోహ‌న్ రెడ్డిదే విజ‌య‌మ‌ని ఆ స‌ర్వే తేల్చి చెప్పేసింద‌ట‌.