Begin typing your search above and press return to search.

జగన్ చెప్పటంతో మళ్లీ కసరత్తు..పీఆర్సీమరింత ఆలస్యం

By:  Tupaki Desk   |   29 Dec 2021 3:00 PM IST
జగన్ చెప్పటంతో మళ్లీ కసరత్తు..పీఆర్సీమరింత ఆలస్యం
X
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనకు మరింత సమయం పట్టొచ్చన్న విషయాన్ని వెల్లడించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. కొంతకాలంగా ప్రభుత్వం నుంచి వస్తుందని భావించిన పీఆర్సీ ప్రకటనపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. దీనిపై ప్రభుత్వం మరోసారి కసరత్తు చేయాలని నిర్ణయించటంతో.. రేపో మాపో వస్తుందన్నట్లుగా ఉన్న ప్రకటన ఆలస్యమవుతుందని చెప్పారు సజ్జల.

కొత్త సంవత్సరానికి కాస్త ముందుగానే పీఆర్సీ తీపికబురు వింటామని ఆశలు పెట్టుకున్న వారికి నీళ్లు చల్లేలాతాజా పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పీఆర్సీపై మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పీఆర్సీతో బడ్జెట్ పై పడే భారాన్ని అంచనా వేస్తున్నామని.. ఆ కారణంతోనే ఆలస్యమవుతుందని చెప్పారు. మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని.. అందుకే.. మళ్లీ కసరత్తు చేస్తున్నామన్నారు.

రేపటి నుంచి పీఆర్సీ ప్రక్రియ వేగవంతం అవుతుందని.. ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచటమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు సజ్జల. పీఆర్‌సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారని.. బుధవారం నుంచి ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పారు. ఫిట్‌మెంట్‌ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని.. బడ్జెట్‌పై పడే పీఆర్‌సీ భారం అంచనా వేస్తున్నామన్నారు.

పీఆర్‌సీ భారం అంచనా వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందని.. ప్రస్తుతం కంటే తప్పకుండా వేతనం పెరుగుదల ఉంటుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం జగన్‌ చర్చలుంటాయని చెప్పటం ద్వారా ఉద్యోగుల ఆశల్ని సజీవంగాఉంచే ప్రయత్నం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీని ఫైనల్ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల డిమాండ్లు ఏంటన్న విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎస్ స‌మీర్ శ‌ర్మ, ఆర్థిక‌, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్యద‌ర్శులను అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగులకు ఎంత మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న అంశంపై చర్చించారు. ఉద్యోగులకు 14.29 శాత‌ం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సీఎస్ కమిటీ నివేదిక ఇవ్వటం.. దీనిపై ఉద్యోగ సంఘాలు కుదరదని చెప్పటం తెలిసిందే. మధ్యంతర భృతి కన్నా తక్కువ పీఆర్సీ ఇస్తే జీతాలు తగ్గిపోతాయంటూ ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో.. ఈ అంశంపై మరోసారి కసరత్తు చేసి.. కొత్త ప్రతిపాదనలతో రావాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. సదరు నివేదిక వచ్చిన తర్వాత.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. వారిని ఒప్పించటం ద్వారా పీఆర్సీ ఎపిసోడ్ ను క్లోజ్ చేయాలన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు.