Begin typing your search above and press return to search.

సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే..

By:  Tupaki Desk   |   18 Dec 2016 9:41 AM GMT
సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే..
X
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి 2012లో చేరిన ప్రవీణ్ 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత పార్టీని, పార్టీ శ్రేణులను పట్టించుకోవడం మానేశారు. అయినా, వైసీపీలో మంచి ప్రయారిటీయే దక్కింది. కానీ... ఆయన మాత్రం ఎందుకో అధికార పార్టీలోకి జంప్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ రాజకీయ ప్రవేశం టీడీపీ ద్వారానే జరిగింది. 2009లో తంబళ్లపల్లి నుంచి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న భావనతో 2012లో ప్రవీణ్‌ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ చెప్పినట్టుగానే తంబళ్లపల్లి టికెట్‌ ను ప్రవీణ్‌ కుమార్ రెడ్డికే ఇచ్చారు. కానీ ప్రవీణ్‌ ఓడిపోయారు. అయినా సరే నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ గా ఆయన్నే జగన్‌ కంటిన్యూ చేశారు.

కానీ ఓడిపోయింది మొదలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ శ్రేణుల గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇటీవల గడగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించగా అన్ని నియోజకవర్గాల ఇన్‌ చార్జ్‌ ను కదిలినప్పటికీ ప్రవీణ్‌ రెడ్డి మాత్రం గడపదాటలేదు. దీంతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అవమానకరంగా తయారైంది. దీంతో వెంటనే జగన్‌ తంబళ్లపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్‌ చార్జ్‌ గా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథ్‌ రెడ్డికి ఆ బాధ్యతలను కట్టబెట్టారు. అప్పటి నుంచి ప్రవీణ్‌ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను పక్కనపెట్టేశారన్న భావనతో ఉన్నారు. అయితే తాను పార్టీ కార్యక్రమాలు చేయక… మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించవద్దంటే ఎలా అన్నది వైసీపీ ప్రశ్న. పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి ఎంట్రీతో వైసీపీ కేడర్‌ మొత్తం ఇప్పుడు ఆయన వెంట తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ దిక్కుతోచక వైసీపీని వీడే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే.. జనంలో తిరగని నేత ఉన్నా.. వేరే పార్టీలోకి వెళ్లిపోయినా నష్టమేమీ ఉండదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/