Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల టోన్ మారుతోంది!

By:  Tupaki Desk   |   7 Sep 2016 6:35 AM GMT
ఏపీ మంత్రుల టోన్ మారుతోంది!
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల రూపంలో రాష్ట్రానికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని.. అయితే ప్యాకేజీతో పాటు హోదా కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని కోరారు. పోలవరాన్ని 2018లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, ఆ స్థాయిలోనే నిధుల కేటాయింపులు కూడా ఉండాలన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్యాకేజీకి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చింద‌నే వార్త‌లు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ప‌త్తిపాటి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌ప‌న‌ప‌డుతున్నార‌ని చెప్పారు. ఏపీకి ఏ విధంగా న్యాయం చేయ‌వ‌చ్చ‌నే విష‌య‌మై ఆయ‌న మ‌థ‌నం చేస్తున్నార‌ని పుల్లారావు అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే ప్ర‌త్యేక హోదా- ప్యాకేజీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పుల్లారావు పేర్కొన్నారు. ప్యాకేజీ రూపంలో స‌హాయం స్వీక‌రిస్తూనే హోదా కోసం పోరాటం చేస్తామ‌ని పుల్లారావు స్ప‌ష్టం చేశారు. ఇదిలాఉండగా అసెంబ్లీ స్థానాలను 220కు పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా జిల్లాల సంఖ్య కూడా పెరిగితే ప్రజలకు ఇబ్బందిలేకుండా పాలించేందుకు దోహదపడుతుందని పుల్లారావు చెప్పారు.