Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ నేతల్ని లెక్కలు అడుగుతున్న పత్తిపాటి

By:  Tupaki Desk   |   8 April 2016 4:50 AM GMT
ఏపీ బీజేపీ నేతల్ని లెక్కలు అడుగుతున్న పత్తిపాటి
X
ఏపీలో మిత్రులుగా ఉన్న టీడీపీ.. బీజేపీల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఏపీ అధికారపక్షాన్ని మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలు విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెడుతున్న వేళ.. ఏపీ తమ్ముళ్లు సైతం మిత్రుల్ని అదే తీరులో నిలదీసే కార్యక్రమాన్ని షురూ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ పెట్టుకున్న మొహమాటపు పరదాల్ని పక్కకు తీసేసిన తెలుగు తమ్ముళ్లు బీజేపీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రం ఏ విధంగానూ ఆదుకోవటం లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. విభజన చట్టంలోని అంశాల్నిమాత్రమే తాము అమలు చేయాలని కోరుతున్నామే తప్పించి.. మరింకేమీ అడగటం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాటల్నే చూస్తే.. బీజేపీ నేతల మీద తెలుగు తమ్ముళ్లు ఎంత ఆగ్రహాంగా ఉన్నారన్నది అర్థమవుతుంది. తాము కొత్తగా అడుగుతున్నది ఏదీ లేదని.. విభజన చట్టంలో ఏం ఉందో దాన్ని అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నట్లుగా చెప్పిన ఆయన రూ.400 కోట్లు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లున్నా ఇంతవరకూ నిధులు ఇవ్వలేదని.. కరువు.. అకాల వర్షాలు.. హుధూద్ తుఫానుకు సంబంధించిన సహాయ నిధులు పూర్తిగా విడుదల కాలేదన్న విషయాన్ని వెల్లడించారు.

పోలవరానికి రూ.200 కోట్లు.. రాజధానికి రూ.200 కోట్లు ఇస్తే సరిపోతుందా? ఆ నిధులు ఏపాటికి? అంటూ పత్తిపాటి ఫుల్లారావు ఫైరింగ్ చూస్తే.. కమలనాథులు కంగుతినక మానదు. ఏపీకీ చాలా చేశామంటూ ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న మాటల్లో నిజం లేదన్నది పత్తిపాటి మాటలు తేల్చి చెబుతున్నాయి. మిత్రుల విషయంలో ఇంత నిష్కర్షగా మాట్లాడుతున్న పత్తిపాటిని చూస్తే.. రెండు పక్షాల మధ్య వచ్చిన గ్యాప్ ఎంతో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.