Begin typing your search above and press return to search.

ఈ పీకే టీమ్‌ కు ఏమైంది..?

By:  Tupaki Desk   |   11 Aug 2018 7:52 AM GMT
ఈ పీకే టీమ్‌ కు ఏమైంది..?
X
ఈ నగరానికి ఏమైంది? అన్నట్టుగా ఈ పీకే టీమ్‌ కు ఏమైంది? అనే ప్రశ్న ఉదయిస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూస్తుంటే. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అమీతుమీ తేల్చుకోవడానికి పాదయాత్రను చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా పది నెలలుగా పాదయాత్రతో సాగుతున్నాడు. ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాన్ని నడిచాడు. ఇక మరో మూడు జిల్లాలు మాత్రమే పెండింగులో ఉన్నాయి. మరింత సుదీర్ఘ కాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పాదయాత్రను కొనసాగించనున్నాడు. తద్వారా ప్రజలకు దగ్గరవుతూ జగన్ సాగుతూ ఉన్నాడు. పాదయాత్రతో జగన్ ఇమేజ్ అనేక రెట్లు పెరిగిందని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక జగన్ ఒక్కడే కష్టపడితే వైసీపీకి అధికారం అందదు. జగన్ ఎంతగా కష్టపడుతున్నాడో.. అందులో పదో వంతు స్థాయిలో వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జిలు కష్టపడితే మాత్రం వైసీపీకి అధికారం అందడం ఖాయం. బూత్ స్థాయి నుంచి మేనేజ్ మెంట్ తోనే విజయం దక్కుతుంది. వైసీపీ ఇన్ చార్జిలుకు కూడా గత ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయం అర్థం అయ్యింది.

అందుకే వీళ్లకు గైడెన్స్ చేయడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పీకే టీమ్‌ ను నియమించుకున్నాడు. రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ టీమ్ తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయాలని జగన్ పీకే టీమ్ ను ఆహ్వానించాడు. వాళ్లకు భారీ మొత్తాలను వేతనంగా ఇస్తూ స్ట్రాటజిస్టులుగా నియమించుకున్నాడు. అయితే పీకే టీమ్ మాత్రం అచేతనంగా కనిపిస్తోంది.

అందుకు రుజువు ఏమిటంటే గత ఐదు నెలలుగా ప్రశాంత్ కిషోర్ టీమ్ వైసీపీ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్‌ నూ చేపట్టకపోవడం. చివరిసారిగా నియోజకవర్గాల స్థాయిల్లో వైసీపీ చేపట్టిన కార్యక్రమం గడపగడపకూ వైఎస్సార్సీపీ.. ఆ తర్వాత మరే కార్యక్రమాన్నీ వైసీపీ గట్టిగా చేపట్టలేకపోయింది. అసలుకు మళ్లీ ఏం చేయాలి? అనే అంశం గురించి నియోజకవర్గాల ఇన్ చార్జిలు ఆరా తీస్తున్నా.. పీకే టీమ్ నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి దిశానిర్దేశం రావడం లేదు. ఏవో రెండు మూడు కార్యక్రమాలను ప్రతిపాదించినా.. అవి కేవలం ప్రతిపాదనలుగానే మిగిలాయి. ఈ కార్యక్రమాల ప్రకటన ద్వారా వైసీపీలో కొత్త ఉత్సాహం ఏదీ రాలేదు. ఏదో చేస్తారని పీకే టీమ్‌ తో జగన్ మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకుంటే... పార్టీలో ఉత్సాహాన్ని నింపుతారని అనుకుంటే.. ఎలాంటి ప్రోగ్రామ్స్ కూ గైడెన్స్ చేయలేక పీకే టీమ్ పార్టీలో మరింత నిస్తేజాన్ని ఆవరించేలా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే.. జగన్ మోహన్ రెడ్డే జోక్యం చేసుకోవాలేమో!