Begin typing your search above and press return to search.

ఇదేంటి పీకే...చీలికలూ పీలికలు.... ?

By:  Tupaki Desk   |   9 Oct 2021 11:20 AM GMT
ఇదేంటి పీకే...చీలికలూ పీలికలు.... ?
X
పీకే.. ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల జనాలకు అదో రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. పీకే అన్న షార్ట్ ఫార్మ్ వెనక చాలానే కధ ఉంది. పీకే అంటే అందరికీ తెలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ దూకుడు చేస్తున్నారు. ఆయన సినిమాలకు వీరాభిమానులు ఉన్నారు. వారందరికీ పీకే అంటే పూనకాలే వస్తాయి. ఇక రాజకీయ సర్వేశ్వరుడిగా మరో పీకే ఉన్నారు. ఈయన అసలు పేరు ప్రశాంత్ కిశోర్. ఈయన ఒక పార్టీ పక్షాన చేరి విజయం కోసం రధమెక్కారంటే అవతల పార్టీకి ప్రశాంతత అన్నది కరవు అవుతుంది. పీకే సాధించిన సక్సెస్ లు అన్నీ ఇన్నీ కావు. ఆయన 2014 ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత బీహార్ ఎన్నికల్లో నితీష్ కూటమి విజయంతో ప్రాచుర్యంలోకి వచ్చారు.

ఇక 2019 ఎన్నికల వేళ ఆయన జగన్ వైపు నిలిచి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం వెనక కీలకమైన పాత్ర పోషించారు. ఏకంగా చరిత్రలో కనీ వినీ ఎరగని విజయం 151 సీట్లతో వైసీపీకి దక్కింది. దటీజ్ పీకే అనిపించింది. తాజాగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం కొట్టడం వెనక పీకే ఉన్నారు. అలాగే తమిళనాడులో స్టాలిన్ విజయం వెనక ఆయన ఉన్నారు. ఇలా పీకే రాజకీయ పార్టీల అధినేతల కంటే కూడా ఎక్కువగా పాపులారిటీ సంపాదించారు.

మరి పీకే ఇపుడు కాంగ్రెస్ పక్షాన జాతీయ స్థాయిలో నిలిచారు. ఆయన రేపటి ఎన్నికల్లో మోడీ సర్కాని ఓడించి విపక్ష కూటమిని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. తాను రాజకీయ సర్వేలు చేయనని, ఎవరికీ ఇక మీదట పొలిటికల్ కన్సల్టెంట్ గా కూడా ఉండనని పీకే చెప్పేశారు. ఇక్కడే కధ అడ్డం తిరుగుతోంది. పీకే టీమ్ ని కూడా బదనాం చేస్తోంది ఈ బోల్డ్ స్టేట్మెంట్. నిజానికి జాతీయ స్థాయిలో ఐప్యాక్ ఇంతలా ప్రాముఖ్యత సాధించడానికి ఆయనకంటూ ఉన్న ప్రత్యేకమైన టీమ్ కారణం.

ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ కి పీకే బ్రాండ్ నేమ్ ఉన్నా తెర వెనక ఉన్నది ఉద్ధండ పండితులే. వారిలో నలుగురు అతి ముఖ్యులు. వారే మొత్తానికి మొత్తం పీకే టీమ్ ని నడిపిస్తారు అని చెప్పుకుంటారు. ఈ నలుగురులో మొదటి వారు ఐఐటీ కాంపూర్ కి చెందిన రిషి, రెండవ వారు. న్యాయవాది లీగల్ సెల్ కి చెందిన వినీష్, ఇక మూడవ వారు ఈషా. ఆమె పంజాబీ. తల్లిదండ్రులు విజయవాడ సెటిలర్స్ అని చెబుతారు. నాలుగవ ముఖ్య వ్యక్తి ప్రతీక్. ఈయన ఐఐటీ ఢిల్లీకి చెందిన వారు.

ఇందులో రిషి అన్న ఆయన ఏపీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ ఎన్నికలను చూశారు. అక్కడ ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ చేపట్టిన బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా నెరవేర్చి విజయాలు అందుకున్నాడు. వినీష్ విషయానికి వస్తే మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ల అసెంబ్లీ ఎన్నికలలో ఐప్యాక్ తరఫున బాధ్యతలు చూశాడు. మహారాష్ట్రలో అయితే సగం విజయమే దక్కింది. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ఓడింది. దాంతో పీకే టీం సారధిగా ఆయన ఫెయిల్ అయినట్లే అంటారు. ఇక ఈషా విషయం తీసుకుంటే పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ లలో ఐప్యాక్ ఒప్పందాల మేరకు ఆయా పార్టీలకు పనిచేశారు. బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్ విజయం దక్కింది. ఇక ఉత్తరాఖండ్ ఫెయిల్ అయింది. ప్రతీక్ విషయం తీసుకుంటే బీహార్ లో 2015 ఎన్నికలను చేశారు. నితీష్ కూటమికి విజయం దక్కేల చూశారు.

ఇక పీకే టీమ్ ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ మీద ఈ నలుగురికీ పట్టుందని చెబుతారు. అంతే స్థాయిలో భాగస్వామ్యం కూడా ఉంది. పీకే పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారుతున్న క్రమంలో ఐప్యాక్ బాధ్యతలను భుజాన ఎత్తుకునే విషయంలోనే పీకే టీమ్ లో లుకలుకలు మొదలయ్యాయని ప్రచారం అయితే గట్టిగా సాగుతోందిట. ఐప్యాక్ పగ్గాలు అందుకోవడానికి కీలకమైన నలుగురు భాగస్వామ్యులూ ఎవరి లెవెల్లో వారు గట్టిగానే ట్రై చేస్తున్నారు అంటున్నారు.దీంతో పీకే టీమ్ లో చీలికలు మొదలయ్యాయా అన్న ప్రచారం అయితే ఉందిట.

లేటెస్ట్ గా పీకే ముందు జరిగిన పంచాయతీలో ఐప్యాక్ పగ్గాలు తమకంటే తమకు దక్కాలని ఈ నలుగురూ గట్టిగానే పేచీ పడినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది మరి. పీకే మాత్రం తన టీమ్ మెంబర్స్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న‌ రిషికి ప్రాంతీయ పార్టీల కన్సెల్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారుట. దీనికి మిగిలిన వారు అడ్డం కొట్టడంతో ఏం చేయాలో తెలియక పీకే తల పట్టుకున్నారని అంటున్నారు. అందుకే ఏపీలో జగన్, తెలంగాణాలో షర్మిల పీకే టీమ్ సేవలను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నా కూడా ఇంకా ఏ సంగతి పీకే తేల్చినట్లుగా లేదని అంటున్నారు. మొత్తానికి ఇదే రకంగా గొడవలు జరిగితే మాత్రం తొందరలోనే ఐప్యాక్ సంస్థ చీలికలు పేలికలు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారుట. మొత్తానికి వార్తలుగా ఇవన్నీ ప్రచారంలో ఉన్నా ఏ సంగతీ ఐప్యాక్ టీమ్ అధికారికంగా వెల్లడిస్తేనే కానీ అసలు విషయం తెలియదు మరి. చూడాలి ఏం జరుగుతుందో.

దీనికి సంబంధించి మీద‌గ్గ‌ర మ‌రింత సమాచారం ఉంటే.. మాతో పంచుకోవ‌డం మ‌ర‌వొద్దు!!